తెలంగాణాలో మహాకూటమి విచ్ఛిన్నం అయ్యే దిశగా మొదటి అడుగు పడింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులకు వెళ్లకుండా ఒంటరిగానే వెళ్దామనీ, పార్టీ ప్రతిష్ఠ పెంచే విధంగా పనిచేద్దామని తెజస అధినేత కోదండరాం నిర్ణయం తీసుకున్నారు. గడప గడపకూ పార్టీ జెండాను, అజెండాను తీసుకెళ్లాలని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనితో తెలంగాణలోని మహాకూటమి ప్రయోగం ఒక్క ఎన్నికతోనే ముగిసిపోతుందా అనేది చూడాలి.
[m9ad]
ఇటీవలే జరిగిన ఎన్నికలలో తెలంగాణ జన సమితి మహాకూటమిలో భాగంగా ఎనిమిది సీట్లలో పోటీ చేసింది. వాటిలో ఏడు సీట్లలో డిపాసిట్లు కూలిపోయింది. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ క్రమంలో మహాకూటమి అనేది తమ కొంప ముంచింది పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. పార్టీ ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే ఎన్నికలు రావడంతో పూర్తి స్థాయిలో సమాయత్తం కాలేకపోయామని వారు సమాధాన పరుచుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో ప్రజాకూటమికే 60 శాతం ఓట్లు వచ్చాయి. విద్యావంతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడానికిదే నిదర్శనమని వారు విశ్లేషిస్తున్నారు.
అయితే పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం విడిగా పోటీ చెయ్యడమే మేలని కోదండరామ్ అంటున్నారు. త్వరలోనే జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో కమిటీల నియామకాలను పూర్తి చేసి గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని పార్టీ నిర్ణయించింది. ‘అదే క్రమంలో కాంగ్రెస్ తో మంచి సంబంధాలు కొనసాగించాలని కోదండరామ్ అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్లారు. ఆదివారం రాత్రికే దిల్లీకి చేరుకొని సోమవారం అక్కణ్నుంచి ప్రత్యేక విమానంలో ఆయా రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పంపడం విశేషం. ఈ లెక్కన మహాకూటమిలో టీడీపీ ఉండటం కోదండరామ్ కు ఇష్టం లేనట్టుగా ఉంది.



