పల్నాడులో కోడెల పేరును తుడిచేయలేరు… నేనున్నాను!

Kodela-Sivaram-Palnaduదివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం టిడిపిపై యుద్ధం ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి తానే శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటించారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మినారాయణను నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే కోడెల శివరాం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును ఢీకొని ఓడించాలంటే తప్పనిసరిగా కన్నా లక్ష్మినారాయణ వంటి బలమైన అభ్యర్ధిని బరిలో దించాలని చంద్రబాబు నాయుడు భావించారు. వచ్చే ఎన్నికలలో ప్రతీ ఒక్క సీటు టిడిపికి చాలా కీలకమే కనుక ఆయన పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.

అయితే తండ్రి వారసత్వంగా ఆ సీటు తనకే దక్కాలని కోడెల శివరాం భావిస్తున్నారు తప్ప అంబటి రాంబాబుని ఆయన వెనుకున్న సిఎం జగన్మోహన్ రెడ్డిని ఢీకొని నిలబడగలమా లేదా అని ఆలోచిస్తున్నట్లు లేదు. అందుకే చంద్రబాబు నాయుడు తనకు అన్యాయం చేశారంటూ కత్తులు దూస్తున్నారు.

మొన్న గురువారం రాత్రి ముప్పాళ్ళ మండలంలోని రుద్రవరం గ్రామంలో తన తండ్రి కోడెల విగ్రహావిష్కరణ సందర్భంగా కోడెల శివరాం మాట్లాడుతూ, “పల్నాడు అంటే కోడెల… కోడెల అంటే పల్నాడు. కానీ పల్నాడు నుంచి కోడెల పేరు తుడిచేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. నేనున్నంత వరకు ఎవరూ పల్నాడు నుంచి కోడెల పేరు తుడిచేయలేరు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే మొట్టమొదట మా తండ్రినే వెంటాడి వేధించి ఆత్మహత్య చేసుకొనేలా చేసింది. అప్పటి నుంచి ఎన్ని బాధలు, మనోవేదన అనుభవిస్తున్నా నేను ధైర్యంగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఎందుకు?మా కుటుంబాన్ని, మా పార్టీన్నే నమ్ముకొన్న కార్యకర్తల కోసం. కనుక ఇప్పుడు ఎవరి కోసమో నేను వారిని వదిలేయలేను.

నా తండ్రి పేరు నిలబెట్టడం కోసం నేను మా ప్రత్యర్ధులతోనే అలుపెరుగని పోరాటం చేస్తున్నాను. ఇక ముందు కూడా ఎవరితోనైనా పోరాటానికి నేను సిద్దం. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి నేనే పోటీ చేస్తాను. తప్పకుండా గెలుస్తాను. కనుక పార్టీ కూడా గుర్తిస్తే బాగుంటుంది,” అని అన్నారు.

కోడెల శివరాం ఇంత స్పష్టంగా చెప్పేశారు కనుక ఇప్పుడు బంతి చంద్రబాబు నాయుడు కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు. మరి ఏమి చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories