కోడికత్తి ఇలా గుచ్చుకుంటోంది ఏమిటో…

kodi-kathi-srinu-JaiBhim-Rao-Bharat-Party

కేసులన్నీ అధికార పార్టీలకు ప్రతిపక్షాలపై ప్రయోగించే అస్త్రాలుగా మారిపోయిన ఈ రోజుల్లో వివేకా హత్య కేసుని, కోడికత్తి కేసులని చంద్రబాబు నాయుడు, టిడిపి నేతల మెడకు చుట్టేసి రాజకీయంగా దెబ్బ తీయాలనుకుంది.

వివేకా హత్య కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి వాదనలు, కోడికత్తి కేసులో జగన్‌ తరపు న్యాయవాది వాదనలు వింటే ఈ విషయం అర్దమవుతుంది. బహుశః అందుకే ఈ రెండు కేసులను 5 ఏళ్ళపాటు సాగదీసి ఉండవచ్చు.

ADVERTISEMENT

రాష్ట్రాభివృద్ధి పట్ల జగన్‌ ప్రభుత్వానికి దూరదృష్టి లేనప్పటికీ, ఇటువంటి కుతంత్రాల విషయంలో చాలా దూరదృష్టి ఉందని చెప్పడానికి ఈ రెండు కేసులే చక్కటి ఉదాహరణ.

కానీ వంకర ఆలోచనలతో చేసే ఏ ప్రయత్నమైనా ఏదో రోజు తప్పక బెడిసికొడుతుందని చెప్పడానికి కూడా ఈ కోడికత్తి కేసే చక్కటి నిదర్శనం. ఈ కేసును 5 ఏళ్ళు సాగదీసినా దీని వెనుక ‘రాజకీయ కుట్ర’ ఉందని వైసీపి నిరూపించలేకపోయింది. కనుక ఈ కేసులో ఐదేళ్ళు జైలులో మగ్గిన శ్రీనుకి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ కేసు పూర్వాపరాలు అందరికీ తెలుసు కనుక ఇప్పుడు దాని ప్రస్తావన అవసరం లేదు. అతను సోమవారం రాత్రి జై భీమ్‌రావ్ భారత్ పార్టీలో చేరాడు. ఆ పార్టీ అధినేత జడల శ్రావణ్ అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో శ్రీనుని అమలాపురం నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయించాలని జడల శ్రావణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తే, జగన్‌ పాలనలో తనతో సహా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా దళితులు ఏవిదంగా పీడించబడుతున్నారో వివరించి, వారి తరపున తన గొంతు వినిపిస్తానని శ్రీను చెప్పారు.

శ్రీను ఎన్నికలలో పోటీ చేసినంత మాత్రన్న గెలుస్తాడని ఎవరూ అనుకోనవసరం లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో ఓ పార్టీ అభ్యర్ధిగా, ఓ కేసులో బాధితుడుగా అతను దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పబోయే విషయాలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ దీర్గాలు తీసే ముఖ్యమంత్రికి, వైసీపిలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేవారికి చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు.

ఈ కోడికత్తి కేసుతో టిడిపి నేతలని దెబ్బ తీయాలని జగన్‌ అనుకుంటే, ఈ కేసులో నిందితుడు శ్రీను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ఇప్పుడు జగన్‌కు నిజంగానే కోడికత్తిలా గుచ్చుకోబోతున్నాడు.

ఇది వైసీపి ఊహించని పరిణామమే. కనుక గత ఎన్నికలలో వైసీపికి ఉపయోగపడిన ‘కోడికత్తి వ్యూహం’ ఇప్పుడు భూతంలా మారి ఈసారి ఎన్నికలలో వైసీపిని వెంటాడబోతుండటం ఆశ్చర్యమే కదా?

ADVERTISEMENT
Latest Stories