ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో “భరత్ అనే నేను” సినిమా చేస్తోన్న కొరటాల శివ, ఈ నెల 27వ తేదీతో షూటింగ్ ముగించి, ఏప్రిల్ 20వ తేదీన సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ తో ‘భరత్ అనే నేను’ హంగామా ముగియనుండడంతో, కొరటాల తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తారు? అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే కొరటాలతో పని చేయాలని జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ టాప్ హీరోలందరినీ పక్కన పెట్టి, సెకండ్ లీగ్ లో టాప్ రేంజ్ లో ఉన్న ‘నాచురల్ స్టార్’ నానితో కొరటాల జత కట్టడానికి సిద్ధమైనట్లుగా ప్రముఖ పత్రిక ప్రచురించింది. ఇందులో ఎంత వాస్తవం ఉందో గానీ, సామాజిక అంశాలకు, కమర్షియాలిటీని జోడించి అద్భుతంగా తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన కొరటాలతో సినిమా అంటే నాని పంట పండినట్లేనని భావించవచ్చు. మూడవ హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న నాని, కొరటాలతో సినిమా కార్యరూపం సిద్ధించుకుంటుందో లేక పుకారుగా మిగిలిపోతుందో చూడాలి.



