‘మిర్చి’ సినిమాతో మొదలైన కొరటాల శివ దర్శకత్వ ప్రతిభకు “శ్రీమంతుడు” చిత్రం నిదర్శనంగా నిలిచింది. ఈ సినిమా సాధించిన విజయం కొరటాలను టాప్ దర్శకుల జాబితాలో చేర్చింది. తాజాగా మూడవ సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ తో “జనతా గ్యారేజ్”కు రెండు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. చేసినవి కేవలం రెండు సినిమాలే అయినా… కొరటాల శివ పుచ్చుకుంటున్న పారితోషికం మాట వింటుంటే సినీ వర్గాలు నోరెళ్ళబెడుతున్నాయి.
తొలి సినిమా ‘మిర్చి’కి గానూ 50 లక్షల రూపాయలను పారితోషికంగా అందుకున్న కొరటాల, రెండవ సినిమా ‘శ్రీమంతుడు’కు అంతకు ఎనిమిదింతలు 4 కోట్ల రూపాయలను తీసుకున్నట్లుగా సినీవర్గాలు చెప్పుకుంటుంటాయి. దీనికి తోడు ప్రిన్స్ మహేష్ అందించిన ఓ లగ్జరీ కారు బోనస్. కేవలం రెండు సినిమాలతోనే ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న ఈ రచయిత కం దర్శకుడు మూడవ సినిమాకు ఏకంగా రెండెంకల రెమ్యూనరేషన్ ను టచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
‘శ్రీమంతుడు’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ‘జనతా గ్యారేజ్’ కూడా నిర్మాతలు. ‘శ్రీమంతుడు’ సినిమా సక్సెస్ ను చవిచూసిన నిర్మాతలు ముందుగా 8 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట. అయితే స్క్రిప్ట్ వర్క్ మరియు సినిమా విషయంలో కొరటాల చూపుతున్న చొరవను చూసి మరో 2 జతచేసి, ఏకంగా 10 కోట్ల మార్క్ ను అందుకోనున్నారని టాక్. ఇదే నిజమైతే కేవలం మూడవ సినిమాతోనే ఈ స్థాయి రెమ్యూనరేషన్ ను అందుకున్న తొలి దర్శకుడిగా రికార్డులకేక్కుతాడు. ఎన్ని సినిమాలు చేసామన్నది కాకుండా… ఎన్ని క్వాలిటీ సినిమాలు చేసామన్నదే ప్రామాణికంగా కొరటాల ముందుకెళ్తున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



