‘1 నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మోడల్ కృతిసనన్, ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తోంది. సక్సెస్ రేటు బాగానే ఉన్నప్పటికీ భారీ సినిమాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైన కృతిసనన్, సినీ పరిశ్రమ పోకడ ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని బయటపెట్టింది. “సినీ పరిశ్రమలో వారసులకే అవకాశాలు ఎక్కువ వస్తాయని, పరిశ్రమతో సంబంధం ఉండడం, చిన్నప్పటి నుంచి వారిని గమనిస్తూ ఉండడంతో స్వశక్తితో బయటి నుంచి వచ్చిన వారి కన్నా, వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తాయని” కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
సినీ పరిశ్రమ జనాలు కూడా అలాంటి వారికే వెన్నుదన్నుగా నిలుస్తారని, ఎక్కువ అవకాశాలు రావడంతో ఒకటి కాకపోతే మరొక దాంట్లో అయినా తమని తాము నిరూపించుకునే అవకాశం వారసులకు లభిస్తుందని తెలిపింది. ఎటువంటి సినీ నేపథ్యం లేని వారికి అవకాశాలతో పాటు బ్యాకప్ కూడా దొరకదని, అయితే ఈ విషయం తెలిసే తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని, ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలకు, వాటిలో ప్రదర్శించిన నటనకు మిక్కిలి సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ జనాల గురించి ఈ ముద్దుగుమ్మ బాగా ఎక్కువగానే తెలుసుకున్నట్లుంది.



