కేటీఆర్‌ హాఫ్ సెంచరీ.. రేవంత్ వికెట్ తీయగలరా?

KTR birthday political debate

నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనని స్వయంగా కలిసి లేదా సోషల్ మీడియా ద్వారా పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేకులు కోసేస్తున్నారు. కేసీఆర్‌ వయసు ఇప్పుడు 50 ఏళ్ళు అంటే హాఫ్ సెంచరీ పూర్తిచేశారన్న మాట.

అయితే ఈ సమయానికి అయన తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండాల్సింది కానీ అందరికీ తెలిసిన కారణాల వలన ప్రతిపక్షంలో ఉన్నారు.

ADVERTISEMENT

కానీ వచ్చే ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీని ఓడించి బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌ నమ్మకంగా చెపుతున్నారు.

కానీ అప్పుడు కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్‌ చెప్తున్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, ప్రజలలో కేసీఆర్‌కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వాడుకోక తప్పదు.

కానీ అయన గత రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాకుండా లోపలే కాలక్షేపం చేస్తున్నందున, రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం లేదని సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు.

నేడు కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ పార్టీ ఆశాజ్యోతి… తెలంగాణ భవిష్యత్‌… కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటివి సహజమే.

ఏపీలో మంత్రి నారా లోకేష్‌తో సహా టీడీపి శ్రేణులు కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు కదా?

నిజమే! కానీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇంట్లో ఉండి పోలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడూ క్షణం ఇంట్లో కూర్చోవడం లేదు.

కేసీఆర్‌ కంటే వయసులో చంద్రబాబు నాయుడు పెద్దవారైనప్పటికీ రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ఓ పక్క ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ, రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడే సిఎం అని టీడీపి నేతలు చెప్పుకోవడం తప్పు కాదు.

బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కాసేపు పక్కన పెడితే, కేసీఆర్‌ పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకోవడం గొప్ప ఆలోచనగా అనిపించదు.

ప్రజలకు, పార్టీ శ్రేణులకు, రాజకీయాలకు దూరంగా ఫామ్‌హౌసులో ఉండిపోయిన కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం బీఆర్ఎస్‌ పార్టీకి బాగానే ఉండవచ్చు.

కానీ పార్టీని గెలిపించుకొని అధికారంలోకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు కేటీఆర్‌కి లేవని స్వయంగా చాటింపు వేసుకున్నట్లవుతోందని గ్రహించినట్లు లేదు. కనుక మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పదలచుకుంటే పార్టీ శ్రేణుల చేత కూడా అదే ముక్క చెప్పించాలి… కదా?

ఒకవేళ కేసీఆర్‌ బయటకు రాకపోయినా, రేవంత్ రెడ్డి వికెట్ నేనే స్వయంగా తీస్తానని కేటీఆర్‌ ప్రకటించినా ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా బలమైన సందేశం పంపించినట్లవుతుంది.

ADVERTISEMENT
Latest Stories