కొన్ని సినిమాలు వినోదాన్ని పంచుతాయి.., మరికొన్ని సినిమాలు సందేశాలను ఇస్తాయి.., కానీ అతి కొద్ది సినిమాలు మాత్రమే వినోదంతో కూడిన సందేశాలను పంపుతాయి… అలాంటి అరుదైన చిత్రాలలో “పెళ్లిచూపులు” ఒకటి అని కేసీఆర్ తనయుడు, తెలంగాణా రాష్ట్ర క్యాబినేట్ మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. ‘పెళ్లిచూపులు’ సినిమా చూసిన తర్వాత, చిత్ర యూనిట్ ను అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెలిబుచ్చారు కేటీఆర్.
“అద్భుతంగా తెరకెక్కించిన ‘పెళ్లిచూపులు’ సినిమాను చూసానని, సరికొత్త పంథాలో తెరకెక్కించిన ‘తరుణ్ అండ్ కో’కు అభినందనలు తెలుపుతున్నానని, తప్పక చూడాల్సిన సినిమా అని” ప్రశంసించారు. ‘మహిళా శక్తిని చాటిన విధానం, బిజినెస్ రంగంలో ఉన్న అవకాశాలను ఎంతో స్ఫూర్తిదాయకంగా మలిచిన తీరు అలరించిందని’ ఈ సందర్భంగా ‘పెళ్లిచూపులు’ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ సినిమా విడుదల కావడానికి ముందే సినీ విశ్లేషకులు ‘పెళ్లిచూపులు’కు అద్భుతమైన రేటింగ్స్ తో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అయితే సినీ విశ్లేషకులు కూడా చెప్పనటువంటి విషయాన్ని, కొత్తగా కేటీఆర్ చెప్పుకొచ్చిన అంశమేమిటంటే… “స్వామికార్యం స్వకార్యం అయ్యే విధంగా… సినిమాలో ‘చిత్ర’ పాత్ర చేసిన ‘ఫుడ్ ట్రక్’ బిజినెస్ ద్వారా స్ఫూర్తి పొందాలని చాటుతూ, మహిళా శక్తి గురించి” ప్రత్యేకంగా ఉదహరించారు.
ఓ పక్కన సినిమాను పొగుడుతూ, మరో పక్కన అందులో ఉన్న ‘థీమ్’ను అర్ధం చేసుకోవాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చినట్లవుతోంది. సినీ విశ్లేషకులు అయితే సినిమా యాంగిల్ లో మాత్రమే ఆలోచించి సమీక్షలు చేస్తారు, అదే కేటీఆర్ లాంటి వాళ్ళయితే, అందులో తమకు ప్రయోజనకారి అయ్యే రాజకీయ ప్రయోజనం కూడా చూస్తారని ‘పెళ్లిచూపులు’ నిరూపించింది. అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలు చూస్తుండడం, వాటిపై అభిప్రాయాలు తెలియజేస్తుండడం ఇటీవల కాలంలో కేటీఆర్ అతి సామాన్యంగా చేస్తున్న విషయం నెటిజన్లకు సుపరిచితమే.



