తెలంగాణలో తమకు ఎదురేలేదనుకొన్న బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్, కేటీఆర్‌ల అహంభావం కూడా ఒక కారణమనే రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట వారిరువురికీ తెలియదనుకోలేము. అయినా కేటీఆర్ ఇంకా అదే అహంభావంతో మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిన్న శాసనసభ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “మీది కొత్త ప్రభుత్వం కనుక మీకు ఓ మూడు నెలలు సమయం ఇద్దామని కేసీఆర్ అన్నారు. మూడు నెలల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని మీరే చెప్పుకొన్నారు. అంటే మార్చి 17వ తేదీ మీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ అన్నమాట!
వాటిని మీరు ఎలాగూ అమలుచేయలేక చేతులెత్తేస్తారని మాకు తెలుసు. అప్పుడు మేము మీ అందరినీ ఇదే సభలో గట్టిగా నిలదీస్తాము. బిఆర్ఎస్ కంటే కేవలం 1.58 శాతం ఎక్కువ సాధించి మీరు అధికారంలోకి వచ్చామని మిడిసిపడుతున్నారు. కానీ మాకు బీజేపీ, మజ్లీస్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 54 మంది ఉన్నారని గుర్తుంచుకోండి,” అని కేటీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలుంటే తమ ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుందనే ఆలోచనతోనే కేసీఆర్ వాటిని నిర్వీర్యం చేసినప్పుడు కేటీఆర్‌కు తప్పనిపించలేదు.
కేంద్రం తమ ఎమ్మెల్యేలను లోబరుచుకొనేందుకు ప్రయత్నించినప్పుడు తమ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు చేస్తోందని బిఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా పేర్కొనబడుతున్న కల్వకుంట్ల కవితని ఈడీ కేవలం ప్రశ్నించడానికి ఢిల్లీకి పిలిపిస్తే, బిఆర్ఎస్ నేతలు ఆడిన డ్రామాలు, చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంటే తమ మీద ఈగ వాలినా సహించబోమని కేసీఆర్ సూచిస్తూనే ఉన్నారని అర్దమవుతోంది.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు కూడా కాకముందే అప్పుడే దానికి కేటీఆర్ డెడ్‌లైన్ పెట్టేస్తున్నారు! పైగా తమ వద్ద 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ బెదిరిస్తున్నారు కూడా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కాసుకుకూర్చోన్నామని కేటీఆర్ చెపుతున్నట్లు అర్దమవుతోంది.
అంటే బిఆర్ఎస్ నేతలకి, వారి ప్రభుత్వానికైతే ఓ రూలు. అదే.. ఇతర పార్టీలు, ప్రభుత్వానికైతే మరో రూలన్న మాట! తాము తెలంగాణని ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ, ఈ అహంకారం, అధికార దాహం కారణంగానే ప్రజలు తమను చిత్తుచిత్తుగా ఓడించారని కేటీఆర్ గ్రహించకపోవడం ఆశ్చర్యమే.
ఇంతకాలం ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీని ఈసడించుకొన్న నోటితోనే బీజేపీ ఎమ్మెల్యేలు మావైపు ఉన్నారన్నట్లు కేటీఆర్ మాట్లాడటం బిఆర్ఎస్ ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. అంటే బిఆర్ఎస్, బీజేపీల మద్య లోపాయికారి ఒప్పందం ఉందనే కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అని కేటీఆర్ స్వయంగా ఒప్పుకొన్నారన్న మాట!
కనుక రేపు లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేసీఆర్ వెళ్ళి దానిలో చేరిపోవచ్చన్న మాట! కేసీఆర్ ఇదో గొప్ప రాజకీయ వ్యూహామని అనుకోవచ్చు కానీ ఆయన తమకు మాయమాటలు చెప్పి మోసాగిస్తున్నారని తెలంగాణ ప్రజలు భావించబట్టే గద్దె దించి ఇంటికి పంపించారని చెప్పక తప్పదు.
కనుక బిఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఈ అహంభావం, వ్యూహాల పేరుతో కుట్రలు చేయడం మానుకోకపోతే వారి కంటే ముందుగా రేవంత్ రెడ్డే బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తారని గ్రహిస్తే వారికే మంచిది.




