ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే…

KTR warns Modi

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్‌ కూడా బాగానే హడావుడి చేసింది.

కానీ బీఆర్ఎస్‌ పార్టీ మాత్రం ఎందుకు మౌనంగా ఉండిపోయింది? బిజేపి-బీఆర్ఎస్‌ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునేనా? అని సిఎం రేవంత్ రెడ్డితో సోషల్ మీడియాలో కూడా పలువురు నిలదీసిన తర్వాత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లో కదలిక వచ్చింది. నేడు హైదరాబాద్‌లో హడావుడి చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా అయన ఆయన ప్రధాని మోడీని ఉద్దేశ్యించి, “మోడీజీ మీరు ఎవరితో ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. కొరివితో తల గోక్కుంటున్నారు. తరం మారుతోంది. స్వరం మారుతోంది. విద్యార్ధులు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చేయగలరని గ్రహిస్తే మంచిది.

మొన్న నేపాల్లో ప్రభుత్వం కుప్పకూలింది. అంతకు ముందు శ్రీలంకలో కూలింది. కనుక మోడీజీ జాగ్రత్తపడండి. జెన్-జీ పెట్టుకోవద్దు. మీ వాట్సప్ బ్యాచ్‌ ఈ జెన్-జీ సోషల్ మీడియా బ్యాచ్‌ని ఎదుర్కోలేదు. తట్టుకొని నిలబడలేదు. రాజ్యమా ఉలిక్కి పడు. జాగ్రత్తగా ఉండూ,” అంటూ కేటీఆర్‌ ప్రధాని మోడీని హెచ్చరించారు.

ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారంటూ కేటీఆర్‌ అన్న మాటలు, ముందుగా కేసీఆర్‌ని గుర్తుకు తెస్తాయి. గతంలో ఆయన సిఎంగా ఉన్నప్పుడు ఇలాగే “మోడీ లేడు గీడీ లేడు. కాంగ్రెస్‌, బిజేపిలని బంగాళాఖాతంలో విసిరేస్తానని’ ప్రగల్భాలు పలికేవారు.

ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తే, ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్‌ వెళ్ళి ఆహ్వానం పలకాల్సి ఉండగా మంత్రి తలసాని యాదవ్‌ని పంపించేవారు. దేశ ప్రధాని హైదరాబాద్‌ వస్తే అడుగడుగునా ఆయనని కించపరిచేలా ఫ్లెక్సీ బ్యానర్లు వెలిసేవి.

తత్ఫలితంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. కనుక కేసీఆర్‌ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని కేటీఆర్‌ గుర్తు చేస్తున్నట్లు అనిపించడం సహజం.

నాడు గ్రూప్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియని రాజకీయాలతో ముడిపెట్టడం వలన ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ ఎదురుదెబ్బ తింది.

కనుక ‘ఈసారి బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే, మళ్ళీ అటువంటి పొరపాట్లు జరుగకుండా నేనే స్వయంగా బాధ్యత తీసుకుంటానని’ కేటీఆర్‌ ఇటీవలే చెప్పుకున్నారు.

అంటే నాడు కేసీఆర్‌ ప్రభుత్వం కూడా విద్యార్ధులతో పెట్టుకోవడం వల్లనే నష్టపోయిందని కేటీఆర్‌ ఇప్పుడు గుర్తుచేసుకొని అంగీకరిస్తున్నట్లు అనిపిస్తుంది.

కానీ ఇంతగా నష్టపోయినా మళ్ళీ కేటీఆర్‌ కూడా ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకుంటున్నారని అనిపిస్తుంది. ఈసారి తెలంగాణ మా టార్గెట్ అని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించి వెళ్ళిన తర్వాత కేటీఆర్‌ ఈవిధంగా మాట్లాడుతుంటే చరిత్ర పునరావృతం కాకుండా ఉంటుందా?

ADVERTISEMENT
Latest Stories