కేటీఆర్‌ ప్రశ్నలకు కాంగ్రెస్‌ వద్ద జవాబులే లేవు పాపం!

KTR

ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజున గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తయారుచేసిచ్చిన గవర్నర్‌ ప్రసంగంలో బిఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలు, టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి, నిరుద్యోగ సమస్య తదితర అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు ఉండటం సహజమే. అలాగే కాంగ్రెస్‌ గొప్పదనం, హామీల అమలు డప్పు సహజమే. వాటన్నిటికీ మాజీ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఘాటుగా జవాబులు ఇచ్చారు. అసలు కేటీఆర్‌ శాసనసభలో మాట్లాడుతుంటే, సిఎం రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ అడ్డుకోలేదు…. అనే కంటే అడ్డుకోలేకపోయారనే చెప్పొచ్చు.

కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఆనాడు కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు తిండిలేక మాడిపోతుంటే గంజి కేంద్రాలు పెట్టిన సంగతి మరిచిపోయారా? లక్షల మంది పొట్ట చేత్తో పట్టుకొని వలసలు పోలేదా?కరెంట్ కష్టాలు, సాగు, త్రాగు నీటి కోసం ప్రజలు అలమటించలేదా?” అంటూ నిలదీశారు.

ADVERTISEMENT

అంతేకాదు… ఆనాడు రేవంత్‌ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ దరిద్రపు పాలన గురించి శాసనసభలో చేసిన విమర్శలను చదివి వినిపించారు. తండ్రి చనిపోతే కనీసం స్నానం చేయడానికి నీళ్ళు కూడా లేక తలమీద నీళ్ళు చల్లుకొని మమ అనిపించేశానని రేవంత్‌ రెడ్డి చెప్పుకొన్న మాటలను కేటీఆర్‌ ఈరోజు గుర్తుచేసారు.

ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలకి ఆమె హయాంలో ఎమర్జన్సీతో సహా ఏవిదంగా ప్రజాప్రభుత్వాలని కూల్చివేశారో కేటీఆర్‌ పూసగుచ్చిన్నట్లు వివరించారు. కేటీఆర్‌ కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ద చిట్టా చదివి వినిపిస్తుంటే కాంగ్రెస్‌ సభ్యులు ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. కేటీఆర్‌ చెప్పినవన్నీ వాస్తవాలే కనుకనే వారు మాట్లాడలేకపోయారని అందరికీ తెలుసు.

“మీరు మందబలంతో గట్టిగా అరుస్తూ నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నా చరిత్ర మారిపోదు. ప్రగతిభవన్‌ గోడపై కేసీఆర్‌ పేరున్న ఫలకంపై మీరు మట్టి పూసినంతమాత్రన్న తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన తెలంగాణ అభివృద్ధిని ఎవరూ దాచేయలేరు,” అని ఘాటుగా విమర్శించారు.

చివరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేచి, “ఇప్పుడు మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో తెలంగాణ శాసనసభలో మాట్లాడుకొంటున్నాము. కనుక ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర తవ్వి తీయడం కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ళ నుంచి జరిగినవి, ఇక ముందు జరుగబోయే వాటి గురించి మాత్రమే చర్చించుకొంటే మంచిది,” అని సర్ధిచెప్పుకొన్నారు.

కేటీఆర్‌ మాట్లాడితేనే కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద జవాబు లేదు. అదే… కేసీఆర్‌ శాసనసభకు వచ్చి మాట్లాడితే కాంగ్రెస్‌ నేతలు ఎవరైనా జవాబు చెప్పగలరా?

ADVERTISEMENT
Latest Stories