పెట్టుబడుల కోసం కేటీఆర్‌ అమెరికాకు… మరి మనోళ్ళో?

KTR Gudivada Amarnathఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వందలకొద్దీ ఐ‌టి కంపెనీలు వచ్చాయి. అనేక రకాల పరిశ్రమలు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి వాణిజ్య సంస్థలు, రాయబార కార్యాలయాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో మరో పదేళ్ళ వరకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరమే లేదు.

కానీ ఆ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, ఆయన అధికారుల బృందం, దీనిని ఓ మహాయజ్ఞంలా నిర్వహించుకుపోతున్నారు. ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు, కంపెనీలు, పరిశ్రమలు వచ్చినా, మరిన్ని సాధించేందుకు ఆయన బృందం మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లింది.

ADVERTISEMENT

కేటీఆర్‌ బృందం అమెరికా లేదా విదేశాలలో ఎప్పుడు పర్యటించినా తెలంగాణ రాష్ట్రానికి కనీసం ఓ 10-15,000 కోట్లు పెట్టుబడులు సాధించుకొని వస్తుంటారు. కనుక ఈసారి కూడా అంత లేదా మరికాస్త ఎక్కువే సంపాదించుకొస్తారని వేరే చెప్పక్కరలేదు. ఒకటి రెండు రోజులలో అమెరికన్ కంపెనీలతో ఎంఓయూలు సంతకాలు చేసేటప్పుడు ఎలాగూ ఈ విషయం అందరికీ తెలుస్తుంది.

తెలంగాణలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలకు కరువు లేనప్పటికీ కేటీఆర్‌ బృందం అమెరికా బృందం వెళ్ళింది. కానీ ఏపీకి రూపాయి పెట్టుబడి, ఒక్క పరిశ్రమ, ఒక్క ఐ‌టి కంపెనీ రానపట్టికీ, ఏపీ ఐ‌టి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వైజాగ్‌-తాడేపల్లి మద్యలో తిరుగుతూ కాలక్షేపం చేసేస్తున్నారు. అధినేత కళ్ళలో ఆనందం చూసేందుకు చంద్రబాబు నాయుడినో, పవన్‌ కళ్యాణ్‌నో నాలుగు తిట్లు తిడుతూ కాలక్షేపం చేసేస్తుంటారు. అసలు మనం విదేశాలకు వెళ్ళవలసిన అవసరమే లేదు ఎందుకంటే జగన్‌ ఇమేజ్‌ చూసి పెట్టుబడిదారులే రాష్ట్రానికి క్యూకడతారు అని చెప్పారు.

ఆయన చెప్పిన్నట్లే ఏపీకి రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో ఓ 1,700 పరిశ్రమలు, వాటిలో ఓ ఆరులక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌కి, ఆయన కుమారుడు కేటీఆర్‌కి ఇంత సులువుగా పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించవచ్చని తెలీదు కనుకనే కంపెనీలు, పెట్టుబడుల కోసం దేశాలు పట్టి తిరుగుతున్నారు పాపం!

ఇక విశాఖ రాజధాని కాగానే ఎలాగూ మంత్రదండం తిప్పి ఉత్తరాంద్ర జిల్లాలను అభివృద్ధి చేసేయబోతున్నారు. కర్నూలులో కుర్చీయో బెంచీయో వేస్తే రాయలసీమ జిల్లాలు వాటంతట అవే అభివృద్ధి చెందిపోతాయి. సంక్షేమ పధకాలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు కరోనా పెరిగిన్నట్లు శరవేగంగా పెరిగిపోతున్నాయి. కనుకనే విద్యుత్, బస్సు ఛార్జీలు, ఇంటి పన్నులు ఎంత పెంచినా టకటకామని కట్టేయగలుగుతున్నారు. కనుక పొరుగు రాష్ట్రాన్ని, వారి రాజధానిని చూసి మనం అసూయ చెందనక్కరలేదు. వారే మనల్ని చూసి అసూయపడాలి… తప్పదు అంతే!

ADVERTISEMENT
Latest Stories