సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే రాజకీయ నాయకులలో కేటీఆర్ ఒకరు. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను పరిష్కరించడంతో, ట్విట్టర్ అనేది కేటీఆర్ కు అత్యంత కీలకంగా మారింది. దీంతో తాజాగా ప్రజలతో ముచ్చటించే కార్యక్రమం పెట్టుకోగా, అందులో భాగంగా తమ అభిమాన హీరోలను అభివర్ణించాలంటూ సినీ ప్రేమికులు కూడా కేటీఆర్ ను అడిగారు. అభిమానులు ఏదో అత్యుత్సాహంలో అడిగారు అనుకుని కేటీఆర్ వదిలేయకుండా, వారికి బదులివ్వడం అసలు మ్యాటర్.
ముందుగా ప్రిన్స్ మహేష్ బాబు గురించి చెప్పిన కేటీఆర్… “స్క్రీన్ ప్రజన్స్ లో సూపర్ స్టార్”లా ఉంటారని అభివర్ణించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను “పర్ ఫామర్”గా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను “బాహుబలి”గా ఒక్క పదంలో చెప్పుకొచ్చారు. ఇంతమంది అగ్ర హీరోల గురించి చెప్పిన కేటీఆర్, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఎందుకు వదిలేస్తారు? ఆయన గురించి కూడా చెప్పారు.
పవన్ కళ్యాణ్ ను ఒక్క పదంలో చెప్పాలని కోరిన అభిమానికి రిప్లైగా “ఎనిగ్మా” అనే సమాధానం ఇచ్చారు కేటీఆర్. అంటే పవన్ కళ్యాణ్ ఎవరికీ అర్ధం కాని వ్యక్తి అని మరియు ఆయనను అభివర్ణించడానికి సాధ్యం కాని వ్యక్తి అని కేటీఆర్ ఇచ్చిన సమాధానం. అంతేకాదు పవన్ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలని మరో అభిమాని కోరగా… ప్రజలు నిర్ణయిస్తారు, నేనెవరు దానిని డిసైడ్ చేసేది అంటూ సూటిగా స్పష్టంగా తేల్చేసారు.



