వచ్చే ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓడించి ఆయనను, టిడిపిని దెబ్బతీయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి రూ.65 కోట్లు కేటాయించి, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించే బాధ్యత అప్పగించారు. అయితే జగన్ ఒకటనుకొంటే జరుగుతున్నది మరొకటి. నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ఒక్క కుప్పంలోనే కాదు రాయలసీమ జిల్లాలన్నీ మళ్ళీ టిడిపికి జేజేలు పలుకుతున్నాయి. నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూస్తే అది అర్దమవుతుంది.
కుప్పంలో మరో ఆసక్తికరమైన రాజకీయ పరిణామం జరిగింది. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. బిఆర్ సురేష్ బాబు పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోతున్నారు. మొన్న ఆదివారం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యి ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన సమక్షంలోనేనే టిడిపి కండువా కప్పుకొని పార్టీలో చేరబోతున్నారు.
డా.బిఆర్ సురేష్ బాబు తండ్రి దొరస్వామి నాయుడు 1978లో కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. కనుక సురేష్ బాబు కూడా ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. గత మూడు ఎన్నికలలో కుప్పం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏపీ పునర్విభజన జరిగి తొమ్మిదేళ్ళవుతున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కనుక కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు. అయితే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తారనే విషయం తెలిసే టిడిపిలో చేరుతున్నారు కనుక బహుశః చంద్రగిరి లేదా నగరి నియోజకవర్గాలలో ఎక్కడి నుంచైనా టికెట్ ఆశించవచ్చు.
డా.బిఆర్ సురేష్ బాబుకి కుప్పంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నందున ఆయనను వైసీపీలోకి రప్పించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించిన్నట్లు సమాచారం. కానీ ఆయన వైసీపీని కాదని టిడిపిలో చేరబోతున్నారు. అంటే ఈసారి ఎన్నికలలో టిడిపి గెలిచి అధికారంలోకి రాబోతోందని గట్టిగా నమ్ముతున్నారన్న మాట! కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుని కనీసం లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపించేందుకు ఇప్పటికే తూర్పు రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొంది. ఇప్పుడు కుప్పంలో మంచి జనాధారణ ఉన్న డా.బిఆర్ సురేష్ బాబు టిడిపిలో చేరితే మరింత బలపడుతుంది.



