కాలక్రమేణా ప్రజల జీవన పరిస్థితులలో, ఆదాయ వ్యయాలలో, రాజకీయాలలో, ప్రకృతి వాతావరణ పరిస్థితులలో… ఇలా ఒక్కటేమిటి ప్రతి చిన్న, పెద్ద విషయాలలో ఎన్నో మార్పులు సంభవించాయి. మరి మారిన పరిస్థితులకు అనుగుణంగా అప్పటి చట్టాలు ఇప్పుడు మారాలి కదా! మారుతున్నాయా? ఖచ్చితంగా మారుతున్నాయి. అయితే అవే కేవలం రాజకీయ నాయకులు వారికి అనుకూలంగా ఉన్న చట్టాల వరకే పరిమితమవుతున్నాయి. నాటి చట్టాలలో కొన్నింటిని ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా మార్పులు చేసున్న వైనం చూస్తున్నదే.
అయితే అంతే చిత్తశుద్ధితో ఇంకా మార్చాల్సిన, కొత్తగా రుపొందించాల్సిన కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ పార్టీ మార్పుల విషయంలో జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఉదాహరణకు ఒక విద్యార్ధి ఏ విద్యాసంస్థ నుండి అయిన ‘టి.సి’ ఇచ్చి పంపించేస్తే… లేక డీబార్ చేసేస్తే… మళ్ళీ ఆ విద్యార్ధికి కొంత కాలం వరకు ఏ విద్యాసంస్థలోనూ అవకాశం దొరకదు. మరి అవే నిబంధనలు రాజకీయ నాయకులకు వర్తించవా?
ఎన్నికలలో ఒక అభ్యర్థి ఒక పార్టీ తరుపున పోటీ చేస్తే ఆ పార్టీ ఓడినా, గెలిచినా ఆ పార్టీలోనే కొనసాగించాలనే చట్టాలను అమలులోకి తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే ఎన్నికల మీద, రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవ భావం ఏర్పడుతుంది. లేకపోతే వర్తమాన రాజకీయాల మాదిరే ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో కొనసాగుతుంటారు.
ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే ప్రజలు మున్ముందు ఓటు వేయడానికి ముందుకు రారేమోనన్న భావన వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షల మేరకు కాకుండా ఈ నేతలంతా వారి స్వలాభం కోసం పార్టీలు మారే సంస్కృతిని ప్రతి పార్టీ అధినేతలు ఈ ప్రోత్సాహించరాదన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడే మన ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలకు ఒక గౌరవం వస్తుందని, అంతేకాదు ఎన్నికల కోసం ప్రజాధనం వృధా అవుతుందన్న ఆలోచనా కూడా క్రమంగా పోతుందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.





