తమిళ దర్శకుడు లింగుస్వామి… దాదాపుగా గత దశాబ్ద కాలంగా తెలుగులో ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు. మొదట మహేష్ తో సినిమా చేయాలని యత్నాలు చేసిన లింగుస్వామి, ఇప్పటికే ఓ అయిదారు కధలను ప్రిన్స్ కు చెప్పడం, ఆ తర్వాత అవే కధలతో తమిళ హీరోలతో తీసి, తెలుగులోకి డబ్ చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ప్రిన్స్ డేట్స్ మరింత కట్టుదిట్టం కావడంతో, లింగుస్వామి చూపులు మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పైకి మళ్ళాయి.
లింగుస్వామి చెప్పిన కధను అల్లు అర్జున్ ఓకే చేయడం జరిగిపోయింది, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వస్తుందని అనుకున్న తరుణంలో… హరీష్ శంకర్ దర్శకత్వంలో “దువ్వాడ జగన్నాధమ్” తెరపైకి వచ్చింది. దీంతో లింగుస్వామి సినిమా కధ కంచికి వెళ్ళినట్లేనని ట్రేడ్ వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఇంతలో ఏమైందో ఏమో గానీ, తాజా పరిణామాలతో అతి త్వరలోనే లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందన్న సమాచారం హల్చల్ చేస్తోంది.
గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం అవుతుందని, ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ తమిళ రంగంలోకి అడుగు పెట్టనున్నారన్న టాక్ కూడా ఉంది. త్వరలోనే ఈ కాంభినేషన్ పై చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఓ అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాల సమాచారం.



