మనకి మనమే తీర్పులు చెప్పేసుకుంటే ఎంత బాగుంటుందో!

Sajjala ramakrishna reddy in liquor scam

ఇప్పుడు రాజకీయ నేతల కేసులపై తీర్పులు చెప్పేవారిని గా విభజించవచ్చు. 1. సొంత పార్టీ నేతలు, 2. ప్రతిపక్ష పార్టీ నేతలు, 3. మీడియా, 4. న్యాయస్థానాలు.

అన్నిటికంటే చివర న్యాయస్థానాలు ఎందుకంటే వాటి తీర్పు ఎప్పటికి వెలువడుతుందో ఎవరికీ తెలియదు కనుక.

ADVERTISEMENT

1. ఈ తీర్పులకు ఉదాహరణగా వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం పోటీ పడుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి మద్యం కుంభకోణం కేసుపై చెపుతున్న తీర్పులు, జారీ చేస్తున్న కాండక్ట్ సర్టిఫికెట్స్. కేవలం రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం ఈ తప్పుడు కేసు సృష్టించి వైసీపీ నేతలను అరెస్టులు చేసి వేధిస్తొందని సజ్జల చెప్పారు. ఇదో బోగస్ కేసని కోర్టులో నిలబడదని కూడా తేల్చి చెప్పేశారు. కనుక ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారందరూ కడిగిన ముత్యాల్లా బయటకు వచ్చేస్తారని సజ్జల చెప్పారు. కనుక సజ్జల జడ్జీ అయ్యుంటే ఒక్క గంటలోనే తేల్చి పడేసి ఉండేవారు కదా!

2. మద్యం కుంభకోణం కేసులో ‘బిగ్ బాస్’ జగన్‌ రూ.3,500 కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఆయనే కనుక రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళక తప్పదని టీడీపి నేతలు తీర్పులు చెప్పేస్తున్నారు. అధికారంలో వారే ఉన్నారు… కనుక ఈ కేసులో తదుపరి పరిణామాల గురించి వారికి ముందే కొంత సమాచారం లభించడం సహజం. కనుక వారి తీర్పుల ప్రకారం ఈ కేసులో జగన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అంతవరకే వారి తీర్పులు ఫలిస్తాయి. ఆ తర్వాత జగన్‌ ఈ కేసుతో ఫుట్ బాల్ ఆదుకోవడం ప్రారంభిస్తే ఇది ఎప్పటికి తెములుతుందో ఎవరికీ తెలియదు.

3. మీడియా తీర్పులు, కధనాలు, విశ్లేషణలు, జోస్యాలు అవి ఏ పార్టీతో అనుసంధానం అయ్యున్నాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఈ కేసులో సాక్షి మీడియా తీర్పు, టీడీపి అనుకూల మీడియా తీర్పులు పూర్తి భిన్నంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ తీర్పులతో కేసులు పరిష్కారం కాకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలు ఎంతోకొంత ప్రభావితం అవుతుంటారు. ఆ ప్రభావం ఎన్నికలలో కనిపిస్తుంది.

4. న్యాయస్థానాలు: పైన పేర్కొన్న మూడు వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ, ఎవరికీ వారు తీర్పులు చెప్పేసుకుంటున్నప్పటికీ, న్యాయస్థానాలు వాటికీ, ముఖ్యంగా కాలానీకి అతీతంగా కేసులు విచారణ జరుపుతుంటాయి. కనుక ఏదో ఓ రోజు తీర్పులు చెప్పవచ్చు లేదా చెప్పకపోవచ్చు. కనుక కేసులలో ముందస్తు బెయిల్ లభించినా, లేదా అరెస్ట్‌ అయ్యి జైలులో గడిపి బెయిల్‌పై బయటకు వచ్చేసినా ‘న్యాయం ధర్మం గెలిచేసినట్లే’ అని అందరూ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు.

కనుక మద్యం కుంభకోణం కేసుపై కూడా మొదటి మూడు రకాల తీర్పులు వినిపిస్తున్నాయి. నాలుగో రకం అంటే న్యాయస్థానాలు తీర్పులు భావితరాలవారు తప్పక చూసే అవకాశం ఉంటుందేమో?

ADVERTISEMENT
Latest Stories