అయినా నువ్వే మా నమ్మకం… భజన చేయక తప్పదుగా

YS-Jagan-Tofel-Scam

తెలంగాణ ఉద్యమాలు జోరుగా సాగుతున్నవేళ వాటిని కాదని జగన్‌ని నమ్ముకొన్నారు కొండా సురేఖ తదితరులు. రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే వారిని నడిరోడ్డున వదిలేసి సమైక్యాంధ్ర అంటూ ఏపీకి వచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళపై ప్రజలు, బిఆర్ఎస్ నేతలు ‘తెలంగాణ ద్రోహులు’గా ముద్రవేయడంతో రాజకీయంగా చాలా నష్టపోయారు.

ADVERTISEMENT

జగన్‌ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా చెల్లిని తర్వాత తల్లిని పార్టీలో నుంచి, రాష్ట్రంలో నుంచి కూడా బయటకు సాగనంపడం అందరూ కళ్ళారా చూశారు.

దశాబ్ధాలుగా తమ కుటుంబంతో విడదీయని అనుబంధం కలిగిన వైసీపి ఎమ్మెల్యేలు మేకపాటి, కోటంరెడ్డి, ఆనం రెడ్డిలతో పాటు ‘అన్నా…’ అంటూ ఎప్పుడూ వెంట తిరిగే ఉండవల్లి శ్రీదేవి మీద కూడా ‘పార్టీ ద్రోహులు’ ముద్రవేసి బయటకు గెంటేశారు.

అదేవిదంగా తమ కుటుంబంతో దగ్గర సంబంధాలు కలిగిన ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మరో బంధువు చేత పొగ పెట్టిస్తూ ఉక్కిరిబిక్కిరిచేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ హయం నుంచి వెంట తిరిగిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ బోస్‌ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఇలాంటి బాధితులు వైసీపిలో ఇంకా చాలా మందే ఉన్నారు. వారిలో మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ముందుగా బయటపడ్డారు. మిగిలిన వాళ్ళు ఇంకా బయటపడలేదు అంతే తేడా!

ఆళ్ళకు ‘గంజి’ పెట్టబోతే ఆయన పార్టీకి, పదవికి రాజీనామా చేసేసి బయటకు వచ్చి తనను జగన్‌ మోసం చేశారని కన్నీళ్ళు పెట్టుకొన్నారు. అలాగే గాజువాక వైసీపి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి కూడా పొగ పెడితే ముందుగా ఆయన కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రేపోమాపో నాగిరెడ్డి కూడా రాజీనామా చేయడం ఖాయమని గ్రహించిన జగన్‌ అప్పుడే మంత్రి గుడివాడ అమర్నాద్‌ని ఆ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించేశారు.

2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని గద్దె దించి తనను ఆ కుర్చీలో కూర్చోబెట్టిన కేసీఆర్‌ ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోయి, ఆస్పత్రి పాలైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయనను పరామర్శించారు కానీ ఇంతవరకు జగన్మోహన్‌ రెడ్డి వెళ్ళి పరామర్శించలేదు.

ఇలా జగన్‌ను నమ్ముకొన్నవాళ్ళందరూ బయటకు గెంటేయబడ్డారు. ఆయనకు తోడ్పడిన వాళ్ళను మరిచిపోయారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇవన్నీ చూడటం లేదనుకోలేము. కానీ వారి చేతే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను నోరారా బూతులు తిట్టించారు కనుక ఆ రెండు పార్టీల తలుపులు మూసుకుపోయాయి. వైసీపిలో ఉండలేక బయటకు వెళ్ళే దారిలేక, ‘నువ్వే మా నమ్మకం జగన్‌’ అని భజన చేస్తున్నారు… కాదు చేయిస్తున్నారు. పాపం వైసీపి నేతలు!

ADVERTISEMENT
Latest Stories