వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం కూడా పాడయినందున ఆయనకీ నేడో రేపో బెయిల్ మీద బయటకు వస్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి కూడా ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు ఇదే కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డికి కూడా బెయిల్ లభించింది.
Also Read – పవన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు…!
వీరందరి కుటుంబ సభ్యులు కాస్త అటూ ఇటూగా అనారోగ్యం పాలవడంతో అందరికీ టకటకా బెయిల్స్ లభించాయి. ఇంకా దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా బెయిల్ సంపాదించుకొని కాకినాడలో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ భారీ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించుకొన్నారు.
ఓ కేసులో కోర్టు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలీదు కానీ ఒక్కసారి బెయిల్ సంపాదించుకొని బయటకు వచ్చేస్తే అక్కడితో ఆ కేసు సమాప్తం అన్నట్లు మారింది. ఆ తర్వాత ఏళ్ళ తరబడి కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంటుంది. వాటిని వారి లాయర్లు చక్కబెడుతుంటారు. అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. బెయిల్‌పై బయటకు వచ్చిన ఏ నిందితుడికీ శిక్ష పడిన దాఖలాలు కనిపించవు. కనుక వీరందరూ ఆ కేసుల నుంచి దాదాపు విముక్తి పొందారనే భావించవచ్చు. ఇది ఇండియా కనుకనే ఈ వెసులుబాటు ఉంది… థాంక్ గాడ్!