ప్రస్తుత ప్రపంచంలో ఫేస్ బుక్ ను ఆయుధంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరిగిపోతోంది. యువతులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలు జరుగుతుండగా ఓ వ్యక్తి ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు పేరు చెప్పి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
శశి అనే వ్యక్తి తనకు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అత్యంత సన్నిహితుడని, అతనిని కలిసేలా ఏర్పాటు చేస్తానని పలువురిని నమ్మించి ఫేస్ బుక్ ద్వారా మోసానికి పాల్పడ్డాడు. ఇతని బారిన పడిన బాధితుల్లో ఒకరు హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ ఘరానా మోసంలో బాధితుడు ఎంత మొత్తం నష్టపోయాడన్న విషయం వెల్లడించకపోవడం విశేషం. అలాగే ఇతని లాగానే మరికొంతమంది శశి బాధితుల జాబితాలో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ సెలబ్రిటీలపై సాధారణ ప్రజల్లో సహజంగా ఉండే క్రేజ్ ను ఇలాంటి మోసపూరితమైన వారికి అవకాశాలు కలుగజేస్తోందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.



