జూలై 15వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్తుందని చెప్పిన మురుగదాస్ – మహేష్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ రీత్యా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తుండగా… సినిమాను మంచి రోజున సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి సరైన ముహూర్తం కోసం వేచిచూస్తున్నారని మరో సమాచారం.
తాజా టాక్ మేరకు జూలై 15వ తేదీ కాకుండా, 29వ తేదీన సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, అదీ కాకపోతే ఆగష్టులోకి మారడం ఖాయంగా కనపడుతోందని తెలుస్తోంది. అయితే ఎప్పుడు ప్రారంభమైనా మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే చేయనున్నారని, ఇందుకోసం ఓ భారీ సెట్ ను కూడా రూపకల్పన చేస్తున్నారని, అయిదు రోజుల పాటు సదరు సెట్ లోనే షూటింగ్ చేస్తారని, ఆ తర్వాత షెడ్యూల్ నిమిత్తం పూణే పయనమవుతారని సినీ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం పడుతున్న వాయిదాల ఎఫెక్ట్ సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత వాయిదాల రీత్యా అది సాధ్యం కాదన్న విషయం తేటతెల్లమైంది. దీంతో 2017 సమ్మర్ బరిలోనే మళ్ళీ మహేష్ నిలుస్తాడని, అప్పటివరకు ప్రిన్స్ అభిమానుల నిరీక్షణ తప్పకపోవచ్చని పక్కా సమాచారం.



