అగ్ర హీరోల సినిమాలకు బడ్జెట్ శృతిమించుతోంది, దాని వలన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆర్ధికంగా బాగా నష్టపోతున్నారని, ఒకవేళ హిట్ అయినా పెద్దగా లాభాలు రావడం లేదన్నది టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల టాక్. గత కొన్నేళ్ళుగా ఈ బడ్జెట్ కంట్రోల్ పై చర్చ జరుగుతూనే ఉంది, అలాగే మరో వైపు ఒక సినిమాను మించి మరొక సినిమా బాక్సాఫీస్ వద్ద తాటాకు టపాసుల మాదిరి పేలుతూనే ఉంటున్నాయి. అసలెందుకు పెద్ద హీరోల సినిమాలకు ఇంత మొత్తంలో ఖర్చవుతోంది అంటే…
హీరో, దర్శకుల రెమ్యూనరేషన్లే ఎక్కువ మొత్తంలో ఉంటుండగా, ఇతర సాంకేతిక విభాగం పారితోషికాలు కూడా ఓ రేంజ్ లోనే ఉంటున్నాయి. వీటికి తోడు ఫారిన్ లొకేషన్లు తదితర అంశాలతో సహజంగా సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు రెండింతలు అవుతోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే, సినిమా నిర్మాణంలో కాస్త అటు ఇటుగా తేడా వస్తే ‘రీ షూట్ల’ పేరుతో మళ్ళీ షూటింగ్ ప్రారంభిస్తే, ఇక ఆ సినిమా ఆర్ధిక పరిస్థితి చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం వీటన్నింటికి తోడు ‘పబ్లిసిటీ’ విషయంలో కూడా ఓ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు.
ఈ పబ్లిసిటీ యావ ఎంతలా మారింది అంటే… ఉదాహరణకు మరో మూడు రోజుల్లో దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న మురుగదాస్ – మహేష్ కాంభినేషన్ల టీజర్ కు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. 10 సెకన్ల టీజర్ ను వర్చువల్ రియాలిటీలో విడుదల చేయడానికి లక్షల రూపాయలు తృణప్రాయంగా ఖర్చు చేస్తున్న వైనం అవాక్కు చేస్తోంది. ఈ టీజర్ రూపొందించే బాధ్యతలను లాస్ ఏంజిల్స్ లో ప్రత్యేకంగా ఓ సంస్థకు అప్పగించారు. నిజానికి మహేష్ బాబు లాంటి హీరోకు ఈ స్థాయిలో పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.
ఏదైనా టీజర్ విడుదలైంది అంటే వెంటనే చూసేయాలన్న కోట్లాది ప్రేక్షకుల అభిమాన గణం ప్రిన్స్ సొంతం. మరి అలాంటప్పుడు కూడా… ఏదొక కొత్త సాంకేతిక పరిజ్ఞానం పేరుతో, పబ్లిసిటీ కోసమని అనవసర ఖర్చులు చేస్తున్నారన్న విశ్లేషణ వెలువడుతోంది. అసలే ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 90 నుండి 100 కోట్ల మేర ఉందన్న టాక్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఉంది. దీనికి తోడు తాజాగా 10 సెకన్ల టీజర్ కు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేయడం, నిర్మాతను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టడం కాదా?
ఈ ప్రభావం ఫైనల్ గా సినిమా విడుదలయ్యే ముందు రోజు మళ్ళీ ప్రేక్షకుల మీదే పడనుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..? అగ్ర హీరోల సినిమాలకు ఎలాగూ అభిమానుల అండ ఉంటుంది కాబట్టి, పబ్లిసిటీ కోసం కాస్త తక్కువ ఖర్చు పెట్టినా, ఓపెనింగ్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లేనిపోని పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టి చేతులు కాల్చుకునే కన్నా, ఒక మంచి కధ కోసం అన్వేషిస్తే బాగుటుందన్న టాక్ అటు సినీ వర్గీయులతో పాటు, ఇటు అభిమాన ప్రేక్షకులలోనూ వినపడుతోంది.



