‘పులిని చూసి నక్క వాతపెట్టుకున్న’ నానుడి తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు ఈ సామెతను పదే పదే గుర్తుకు తెస్తున్నాయి. తెలుగు సినీ వినీలాకాశంలో ‘బాహుబలి’ సినిమా సృష్టించిన రికార్డులు తెలియనివి కావు. ‘నభూతో నభవిష్యత్’ అన్న రీతిలో సాగిన ‘బాహుబలి’ రెండు పార్టుల కలెక్షన్స్ ను చూసి తమ సినిమాలు కూడా అదే స్థాయిలో వసూలు చేస్తాయని భావించడం నేటి అగ్ర హీరోల వంతవుతోంది. దీంతో ‘బాహుబలి’ కలెక్షన్స్ తో సరిసమానంగా పెద్ద హీరోలు తమ సినిమాలను మార్కెట్ చేసుకుంటున్నారు.
కానీ తీరా ధియేటర్లకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణలే “జై లవకుశ” మరియు “స్పైడర్” చిత్రాలు. ‘బాహుబలి పార్ట్ 1’ సాధించిన అమోఘమైన విజయమే, తమను 120 కోట్లు పీట్టి సినిమాను చేసేందుకు ప్రేరణ ఇచ్చిందని, స్వయంగా ‘స్పైడర్’ హీరో మహేష్ బాబు వెల్లడించారు. అయితే ‘బాహుబలి’ లాంటి హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్స్ ను చూసిన కళ్ళతో ‘స్పైడర్’లోని సాధారణ టాలీవుడ్ గ్రాఫిక్స్ ను తిలకించేందుకు సిద్ధంగా లేమని తెలుగు ప్రేక్షకులు నిర్మొహమాటంగా చెప్పారు.
120 కోట్లు పెట్టామని చెప్పడం గొప్పకాదు, ఆ 120 కోట్లు వెండితెరపై కనిపించినపుడే, వాటి గొప్పతనం తెలుస్తుంది. అలా కాకుండా అంత ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం… అంటూ ప్రగల్భాలు పలికితే, చివరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందో, ప్రస్తుతం “స్పైడర్” చిత్ర యూనిట్ ను చూస్తే తెలుస్తుంది. ఏ విజువల్ అయినా కధలో భాగం అయితే ప్రేక్షకులకు నప్పుతుంది గానీ, విజువల్ ను సృష్టించుకుని కధను క్రియేట్ చేయాలనుకుంటే భంగపాటు తప్పదని గతంలో కూడా చాలా చిత్రాలు నిరూపించాయి.
‘బాహుబలి’ పుణ్యమా అంటూ పెరిగిన తెలుగు సినిమా మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలం అయితే, అవి చివరికి ‘బాహుబలి’కి కూడా బ్యాడ్ అవుతుందని హెచ్చరించాల్సి వస్తుంది. తెలుగు సినిమా గొప్పదనం గురించి చెప్పాలంటే… ఒక్క ‘బాహుబలి’ మాత్రమే అని చెప్పుకునే విధంగా కాకుండా, ‘టాలీవుడ్ ప్రస్థానంలో ‘బాహుబలి’ అనేది కేవలం ఓ మలుపు లాంటిదేనని చెప్పుకునే విధంగా… భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల దిశగా మన తెలుగు దర్శకనిర్మాతలు, హీరోలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పాలి.





