‘అతడు, ఖలేజా’ సినిమాలతో క్రేజీ కాంభినేషన్ గా మారిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – ప్రిన్స్ మహేష్ బాబులు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని సినీ అభిమానులు వేయి కళ్ళతో వేచిచూస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ కు సిద్ధం కావడానికి మరికొంత సమయం పడుతుంది గానీ, ప్రస్తుతం బుల్లి స్క్రీన్ పై సందడి చేసేందుకు మాత్రం, ఈ ఇద్దరూ కలిసారు.
అవును… ప్రిన్స్ ఖాతాలో మరో యాడ్ వచ్చి చేరింది. ‘లాయిడ్’ ఎయిర్ కండిషనర్లకు ప్రచారకర్తగా సంతకాలు చేసిన మహేష్ పై యాడ్ ను చిత్రీకరించారు త్రివిక్రమ్. ప్రిన్స్ నటించే యాడ్ లలో ఎక్కువ శాతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించినవే అన్న విషయం తెలిసిందే. ఇటీవల బుల్లితెరపై నవ్వులు పంచుతోన్న ‘అభిబస్’ యాడ్ కూడా వీరిద్దరి కాంభినేషన్ లో వచ్చినదే.
ట్విట్టర్ వేదికగా ఇటీవల ప్రిన్స్ తన సినిమాలను ప్రకటించగా, ప్రస్తుతం నటిస్తోన్న మురుగదాస్ తర్వాత కొరటాల శివతో, ఆ తర్వాత వంశీ పైడిపల్లితో జతకట్టనుండగా, ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుందని చెప్పిన విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ లోపున త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్ తెరపైకి వెళ్లనుంది.



