ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల అవుతుంది? టీజర్ ఎప్పుడు? అంటూ ప్రిన్స్ అభిమానులంతా ఎదురుచూస్తున్న వేళ… వారు ఆశించింది కాకపోయినా… ‘అంతకుమించిన’ వార్తను ఒకటి అందించారు ప్రిన్స్. గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘త్రివిక్రమ్ – మహేష్’ కాంభినేషన్ కు మొదటి అడుగు పడడం ఫ్యాన్స్ కు కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చిన అతి పెద్ద బహుమతిగా భావించాలి.
వరుసగా మూడు ప్రాజెక్ట్ లను మహేష్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న కొరటాల శివ – దానయ్య చిత్రం మహేష్ కెరీర్ లో 24వ సినిమాగా, వంశీ పైడిపల్లి – దిల్ రాజు – అశ్వనీదత్ జోడిలో మహేష్ 25వ చిత్రం, త్రివిక్రమ్ – మైత్రీ మూవీ మేకర్స్ ల కలయికలో 26వ సినిమా ఉంటుందని తెలిపారు. అయితే ఈ మూడింటిలో తొలి రెండు సినిమాల సమాచారం ఇప్పటికే తెలియగా, ‘మాటల మాంత్రికుడు’ సినిమాను మాత్రం మహేష్ కొత్తగా తెలిపారు.
ఇక, ప్రస్తుతం చేస్తోన్న మురుగుదాస్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నానని, ‘సూపర్ కూల్’ డైరెక్టర్ మురుగదాస్ తో చేయాలన్న కల ఈ సినిమాతో నేరేవేరిందని, ఉత్సాహభరితమైన దశలో తన కెరీర్ లో సాగుతోందని చెప్తూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు ప్రిన్స్. ఇన్ని సంగతులు చెప్పారు గానీ, మురుగదాస్ తో నటిస్తోన్న సినిమా టైటిల్ గానీ, ఫస్ట్ లుక్, టీజర్ విశేషాల గురించి ప్రస్తావించలేదు. దీంతో కొత్త ఏడాది సందర్భంగా కూడా ‘ప్రిన్స్ 23’ ఫస్ట్ లుక్ విడుదల కావడం కష్టమేనని తేలిపోయింది.



