శ్రీరాముడిపై సీతా మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ రాజకీయ విమర్శకుడు కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసు కమీషనర్ నగర బహిష్కరణ విధించారు. కత్తి మహేష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వల్ల తీవ్ర దుమారం చెలరేగి మత కలహాలు రేగే అవకాశం ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశించవద్దని కత్తిని ఆదేశించారు.
ఈ మేరకు ఆయనను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని.. నగరం బయటవరకు తీసుకెళ్లి.. అక్కడ ఏపీ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. కాగా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. ఈ ఉదయమే ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు… పరిపూర్ణానంద స్వామి బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిపూర్ణానంద ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పరిపూర్ణానంద భక్తులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి తరలివస్తున్నారు.



