‘బిగ్ బాస్’తో తనకొచ్చిన ఫేంను వినియోగించుకుని ఒక సెలబ్రిటీగా మార్చుకున్న మహేష్ కత్తిపై పవన్ ఫ్యాన్స్ చేసిన దాడులతో మీడియా వర్గాలలో ఓ రేంజ్ లో హల్చల్ చేసి, ప్రస్తుతం ‘మహేష్ కత్తి’ అంటే ఏంటో అందరికి తెలిసివచ్చేలా చేసారు. అప్పటినుండి సోషల్ మీడియాలో తన భావాలను నిరభ్యంతరంగా చెప్పడంలో ముందుంటున్న కత్తి, తాజాగా రేణుదేశాయ్ అంశంలో పవన్ ఫ్యాన్స్ చూపిన ఉత్సుకతను ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.
‘రేణుదేశాయ్ వ్యక్తిగత జీవితంపై పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టిన మహేష్ కత్తి, మరోసారి పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. “పవన్ ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ లో ఉందిగా” అంటూ ఫేస్ బుక్ వేదికగా కామెంట్ చేయడంతో, మళ్ళీ ప్రతిదాడి సర్వసాధారణమైంది. గత కొంతకాలంగా జరుగుతోన్న ఈ యుద్ధం ఇటీవలే సర్దుమణిగిందనుకున్న తరుణంలో… పవన్ ఫ్యాన్స్ మళ్ళీ ఓ అవకాశాన్ని ఇచ్చినట్లయ్యింది. దీంతో మరోసారి చెలరేగడం మహేష్ కత్తి వంతవుతోంది.
పవన్ అభిమానులు చేస్తున్న ఎదురుదాడితో స్పందించిన కత్తి… “చెప్తాం బ్రదర్… పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ ఇష్యూ చేసింది మీరు, ఇక చెప్పక తప్పదు బ్రదర్!” అంటూ బన్నీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పవన్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొడుతున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మహేష్ కత్తి పూర్తిగా సక్సెస్ అవుతుండగా, పవన్ ఉన్న అభిమానాన్ని చూపించడంలో తొందరపాటుకు గురవుతున్న ఫ్యాన్స్, ఇలాంటి వారికి ఓ అవకాశాన్ని ఇవ్వడంలో ముందుంటున్నారు.


