పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ఆమె భద్రతా సిబ్బంది శుక్రవారం ఉదయం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆమె నుదురు, ముక్కు చిట్లి గాయం నుంచి రక్తం కారుతోంది. వైద్యులు ఆమెకు వెంటనే కుట్లు వేసి ప్రాధమిక చికిత్స చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు గాయాల నుంచి రక్తం కారుతున్న ఆమె ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఆమెకు బీపీ ఎక్కువ అవడం వలన ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు గాయాలయ్యాయని కొందరు చెపుతుండగా, ఎవరో ఆమెను వెనక నుంచి తోసేయడం వలన పడిపోయి గాయపడ్డారని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బందోపాద్యాయ చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆమెకు పటిష్టమైన భద్రత ఉంటుంది. కనుక ఆమె బీపీ కారణంగానే పడిపోయి ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు.
కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆమె ఇంట్లో పడిపోయి గాయపడితే ఇంటి వద్దకే వైద్య బృందం వస్తుంది. కానీ ఓ పక్క రక్తం కారుతుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆమెను ఆ స్థితిలో హాస్పిటల్‌కు తరలించి మీడియా దృష్టిలో పడేలా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత శాసనసభ ఎన్నికలలో ఆమె కాలికి దెబ్బ తగిలితే ప్రజల సానుభూతి పొందేందుకు కాలికి బ్యాండేజీ వేయించుకొని, వీల్ ఛైర్‌లో కూర్చొని ఎన్నికల ప్రచారం చేశారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 214 సీట్ల భారీ మెజార్టీతో ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మమతా బెనర్జీ కాలికి కట్టిన బ్యాండేజీ తీసేసి లేచి నిలబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు!
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆమె అలాంటి డ్రామాయే ఆడేందుకు సిద్దం అయ్యారని బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రక్తం కారేలా గాయపడితే, ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం, ఎటువంటి విచారణ జరుగకపోవడం కూడా బీజేపీ నేతల అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ సీట్లున్నాయి. గత ఎన్నికలలోనే బీజేపీ వాటిలో 18 సీట్లు గెలుచుకోగా తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకొంది. ఈసారి బీజేపీ కనీసం 25 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని సర్వేలు సూచిస్తున్నాయి. కనుక మమతా బెనర్జీ మళ్ళీ సానుభూతి ఓట్ల కోసమే ఈ కొత్త డ్రామా మొదలుపెట్టి ఉండవచ్చని బీజేపీ అనుమానాలను కొట్టిపారేయలేము.




