మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి తన శాసన సభ్యత్వానికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాటులో అసెంబ్లీ కార్యదర్శికి అందచేశారు ఆర్కే.
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ మీద విజయం సాధించి రాష్ట్రంలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఆర్కే. టీడీపీ పార్టీ ని ఇరుకునపెట్టడానికి, చంద్రబాబు పై కేసులు వేస్తూ నిత్యం ఏదోక వార్తలలో ఉండేవారు ఆళ్ల. అలాగే సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్న రామకృష్ణ రెడ్డి ఇలా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎమ్మెల్యే పదవికి, పార్టీ కి రాజీనామా చేయడం తాడేపల్లి రాజకీయాలలో ఒక్కసారిగా కలకలం రేగింది.
కరకట్ట కమలహాసన్ గా మంచి గుర్తింపు పొందిన ఆర్కే గత కొద్దీ రోజులుగా తాడేపల్లి పాలస్ కు, వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టి పార్టీ నిర్ణయానికి ఒత్తాసు పలికిన ఆర్కే ఇప్పుడు రాజీనామా చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియక వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
లోకేష్ మీద గెలిచిన కారణంగా పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆశ పడిన ఆర్కే కు జగన్ నిరాశే మిగిల్చారు. కనీసం రెండు సార్లు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆర్కే కు ఒక్క మంత్రి పదవి కూడా కట్టబెట్టలేదు జగన్. తాజాగా తనకు వ్యతిరేకంగా మురుగుడు హనుమంతరావుని,గంజి చిరంజీవిని పార్టీ ప్రోత్సహించడంతో జగన్ వైఖరి పై విసిగిన ఆర్కే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని స్థానిక సమాచారం.
దానికి తోడు ఓడిపోయినప్పటికీ స్థానిక ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి స్థానిక సమస్యల పై తనవంతు సహకారం అందిస్తూ మంగళగిరిలో పార్టీ జెండా ఎగరవేయాలనే గట్టి పట్టుదలతో లోకేష్ పని చేయడం దానికి తగ్గటే స్థానికులు టీడీపీ పార్టీ వైపు మొగ్గుచూపడం కూడా ఆర్కే గెలుపు పై తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు.మొత్తానికి అధినేత మీద అలకో..ఓటమి భయమో కానీ ఎన్నికల ముందు ఆర్కే తీసుకున్న ఈ రాజీనామా నిర్ణయం వైసీపీ పార్టీ పై గట్టి ప్రభావాన్ని చూపనుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో మొదలవ్వడానికి తాడేపల్లి సాక్షిగా ఆర్కే తొలి పునాది వేశారు అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇక రానున్న రోజులలో వైసీపీ లో ఇటువంటి రాజీనామా లేఖలు మరికొన్ని రానున్నాయి అంటూ స్థానిక టీడీపీ – జనసేన నేతలు మరింత ఉత్సాహంగా ముందుకెళుతున్నారు.




