సినిమాలు, రాజకీయాలు, క్రీడలు… ఏ రంగంలోనైనా ఒడిదుడుకులు తప్పవు. జయాపజయాలు, కష్టాలు, కన్నీళ్ళు తప్పవు. వాటిని ఓర్చుకొని, పాఠాలు నేర్చుకుంటూ, తనని తాను సరిదిద్దుకున్నవారే రాణిస్తారు.
ఇందుకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి నేతలు నిలువెత్తు నిదర్శనం. తాను కూడా సినీ పరిశ్రమలో ఇలాగే ఎదిగానని దర్శకుడు మారుతి చెప్పారు.
యువతని ఆకట్టుకోవాలని ఒకప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు వాడేవాడినన్నారు. దాంతో ‘బూతు దర్శకుడు’ అనే ముద్ర పడిందని ఆయన చెప్పారు. ఆ ట్యాగ్ తన కెరీర్‌ను నాశనం చేస్తుందని గ్రహించగానే మార్పు చేసుకున్నానని తెలిపారు.
తన నిర్మాణ సంస్థలో తీసిన బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి ప్రసంగం స్పూర్తిదాయకంగా సాగింది. అదే వేదికపై, మరో దర్శకుడు మోహన్ శ్రీవత్స గురించి మాట్లాడినప్పుడు దర్శకుడు మారుతి ఇవన్నీ చెప్పారు.
అతను తీసిన ‘త్రిబాణదారి బార్బరిక్’ ఫ్లాప్ అవడంతో వేదికపైనే చెప్పుతో కొట్టుకున్న విషయం ప్రస్తావిస్తూ, తాను ఎదురుదెబ్బలు నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ప్రభాస్‌తో రూ.400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తీసే స్థాయికి ఎదగగలిగానని మారుతి అన్నారు.
ఓటమి జీవితానికి అంతం కాదు. అదొక జీవిత పాఠం. కనుక నేర్చుకొని ముందుకు సాగాలే తప్ప సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన చెప్పుతో కొట్టుకోవడం, సినిమాలు మానేస్తానని చెప్పడం సరికాదన్నారు మారుతి.
ఇలాంటి మాటలు, చేష్టలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తాయని హెచ్చరించారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోవడానికి చేసే చవుకబారు ప్రయత్నాలుగా భావించబడతాయన్నారు.
‘త్రిబాణదారి బార్బరిక్’ టైటిల్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అవరని ముందే హెచ్చరించినా అతను ఒక రకమైన ట్రాన్స్‌లో ఉండటంతో నా సలహా పట్టించుకోలేదని మారుతి చెప్పారు.
సినిమా రంగంలోనే కాదు, ప్రతి రంగంలో అపజయాలు అనివార్యమని కనుక వాటిని ధైర్యంగా స్వీకరించి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే సరైన పద్దతన్నారు.
కృష్ణానగర్ కాలనీలో సినీ అవకాశాల కోసం వేలాది మంది పోరాడుతున్నారు. వారు, వారి జీవితాలు, పోరాటాలతో పోల్చితే ఓ సినిమా దర్శకుడిగా ఎదగడం మామూలు విషయం కానే కాదు. కనుక ఇండస్ట్రీలో ఓ స్థాయికి ఎదిగిన ప్రతీ ఒక్కరూ తమ ఎదుగుదలని గుర్తుంచుకుంటే సినిమా ఫ్లాప్ పెద్ద సమస్య కానే కాదు.





