రాష్ట్రంలో పెట్టుబడుల కోసం నాలుగు దిక్కులా తిరిగేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సఫలీకృతం దశకు చేరుకున్నట్లుగా కనపడుతోంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోకి పెట్టుబడుల వెల్లువ వస్తుండడంతో చంద్రబాబు సర్కార్ కు నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది. చైనా పర్యటన విజయవంతం అయిన నేపధ్యంలో ఈ వారాంతంలో రష్యా పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ లోపున స్థానికంగా పలు సంస్థలతో జరుపుతున్న చర్చలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తున్నాయి.
తాజాగా ప్రముఖ కార్ల సంస్థ ‘మారుతీ సుజుకి’ మరియు ఏపీ సర్కార్ కు మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రకాశం జిల్లా, దర్శి శివార్లలో గల వెంకటచలం గ్రామంలో ‘డ్రైవింగ్ ట్రైనింగ్ మరియు ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ను ఏర్పాటు చేసే విధంగా ఇరువురి మధ్య ఒప్పందాలు కుదిరాయి. కార్ల అమ్మకాలలో టాప్ స్థానంలో ఉన్న మారుతీ ఇన్స్టిట్యూట్ కావడంతో ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువు తీరుతున్నట్లయ్యింది.



