మెగా సింహాసనం కోసం ఫైట్స్… నిజమేనా?

Mega Family Allu Family

ఒకప్పుడు ఏఎన్ఆర్-ఎన్టీఆర్‌-కృష్ణ-కృష్ణంరాజు అభిమానులు దశాబ్ధాలపాటు హోరాహోరీగా పోరాడుకున్నారు. అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వగైరా లేవు కనుక అవి కార్చిచ్చులా వ్యాపించేవి కావు. కేవలం ‘వీరాభిమానుల’ మద్య మాత్రమే ఆ యుద్ధాలు జరుగుతుండేవి. మిగిలిన వారందరూ ప్రేక్షకులుగా మాత్రమే ఉండేవారు.

కానీ ఇప్పుడు ‘ఏఐ’తో సహా అత్యాధునిక యుద్ధ పరికరాలు, ట్విట్టర్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ వంటి సువిశాలమైన యుద్ధ వేదికలు అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. కనుక ఇప్పుడు సినీ అభిమానుల యుద్ధాలలో ఇరువైపులా సైన్యాలు, ఆయుధాలు పెరిగాయి. అలాగే ప్రేక్షకులు కూడా పెరిగారు.

ADVERTISEMENT

ఆ ప్రేక్షకులలో మేధావులు కూడా తలో పక్క చేరి ఉడతా భక్తిగా సమిధలు వేస్తూ ఆ మంటలు కార్చిచ్చులా మార్చేందుకు తమ అమూల్యమైన సమయం కేటాయించి చాలా నిబద్దతతో పనిచేస్తుంటారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, మెగా-అల్లు కుటుంబాల మద్య చిన్నగా మొదలైన మంట, కార్చిచ్చులా సోషల్ మీడియాలో వ్యాపించడం గురించే. ఇండస్ట్రీలో ‘మెగా సింహాసనం’ కోసం రెండు కుటుంబాల మద్య పోరాటాలు మొదలయ్యాయని వాటి సారాంశం.

చిరంజీవి కెరీర్‌ ముగింపు దశలో ఉందని, పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలోకి వెళ్ళిపోయారు కనుక ‘మెగా సింహాసనం’పై తన కొడుకుని కూర్చొబెట్టుకోవాలని అల్లు అరవింద్ తహతహలాడుతున్నారని, అందుకే కొడుకు భుజంపై తుపాకీ పెట్టి మెగా కుటుంబాన్నిషూటింగ్‌ చేస్తున్నారని కొందరు ఎంపైర్లు కనిపెట్టి చెపుతున్నారు.

అందుకు నిదర్శనంగా ఓ సినీ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ ‘నేను చెప్పను’ అనే డైలాగ్‌, ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్ళి వైసీపి అభ్యర్ధికి మద్దతు పలకడం మొదలు మొన్న మరో ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడిన మాటల వరకు ప్రతీదీ జాగ్రత్తగా నోట్‌ చేసుకొని, ఎవరికీ తెలీని ఆ వాఖ్యాల అర్ద తాత్పర్యాలని విడమరిచి చెప్పి, అందువల్ల… అల్లు అర్జున్‌ ‘పుష్ప’ కంటే చాలా డేంజర్… అతని తండ్రే ‘అసలు విలన్‌’ అని నిర్ధారించేశారు మెగా మేధావి వర్గం. బొత్తిగా కృతజ్ఞత లేని ఈ అల్లు బ్యాచ్‌ని బ్యాన్ చేస్తే బాగుంటుందని, అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవడం చాలా అత్యవసరమని ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు.

అయితే కంటికి కనపడని అక్షాంశాలు, రేఖాంశాల వంటిదే ఈ మెగా సింహాసనం కూడా. అల వైకుంఠపురంలో అంతటి ఉదాత్త హీరో మావాడు. కుర్చీల కోసం ఆరాటపడే అవసరం, తీరికా రెండూ లేవు మా పుష్పకి. ఫ్లవర్ అనుకుంటున్నారా ఫైర్… తెలుసుకోకుండా నిప్పుతో చలగాటం ఆడుతున్నారు, అంటూ ఇటువైపు నుంచి కూడా మిసైల్స్ పేలుతున్నాయి. కనుక ఈ యుద్ధాలు ఇప్పట్లో ఆగేవి కావు.

కానీ ఇండస్ట్రీలో ఒకరి స్థాయిని వారి విజయాలే నిర్ణయిస్తాయనే సంగతి మరిచిపోకూడదు. వరుసగా నాలుగైదు ఫ్లాపులు పడితే ఎంత పెద్ద హీరో అయినా జీరో అయిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే తమ స్థానం కాపాడుకునేందుకు ప్రతీ హీరో, హీరోయిన్‌ తాపత్రయపడుతుంటారు.

అయితే ఆ స్థానం కోసం ఒకరినొకరు తొక్కేసుకోవాలని ప్రయత్నిస్తే అందరి కాళ్ళకు బురద అంటుకుంటుంది. కనుక సినిమాల ద్వారానే ఆ స్థానం పదిలం చేసుకోవడం చాలా ఉత్తమం. వారు అదే పనిలోనే ఉంటారు కూడా.

కానీ హీరోలందరూ ఎవరి పని వారు చేసుకుకుపోతుంటే సోషల్ మీడియాలో మేధావులకు ఇక గుర్తింపు ఎలా లభిస్తుంది? అందుకే నిప్పు ఉన్నా లేకపోయినా పొగ రాజేస్తుంటారు… కనుక కాలక్షేపం కోసం చాలా మంది ఆ మంటలో చలి కాచుకుంటుంటారు.

ADVERTISEMENT
Latest Stories