ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే పాఠశాలల దశదిశ మార్చి చూపిస్తానని చెపుతూ నాడు-నేడు కార్యక్రమం కింద వందల కోట్లు ఖర్చు పెట్టి పాఠశాలలను మరమత్తులు చేయించి, రంగులు వేయిస్తున్నప్పుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు, ప్రజలు అందరూ కూడా చూసి మురిసిపోయారు. అయితే ఏడాది తిరిగేసరికి వాటన్నిటికీ తాళాలు వేసేసి విద్యార్థులను సమీపంలో మరో పాఠశాలలో విలీనం చేసేయడంతో అందరూ అవాక్కయ్యారు. పాఠశాలల దశ, దిశ మార్చినట్లు అందరూ అంగీకరించక తప్పడం లేదు.
అయితే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసింది తాళాలు వేసుకోవడానికా?అని అందరూ ప్రశ్నిస్తున్నారు. వాటిని వేరే అవసరాలకు ఉపయోగించుకొంటామని విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణవారు సెలవిస్తున్నప్పటికీ దేనికి వినియోగిస్తారో చెప్పలేకపోతున్నారు. అంగన్వాడీలకు ఉపయోగించుకొంటామని కొందరు మంత్రులు చెపుతున్నప్పటికీ వాటికి ఇంత సువిశాలమైన పాఠశాలలు అవసరం లేదు. కనుక వారి మాట అబద్దమని అర్దమవుతోంది.
పాఠశాల ఆవరణాలలో సచివాలయాలు నడుపుతున్నందుకు హైకోర్టు 8 మంది ఐఏఎస్ అధికారులకు రెండేసి నెలలు జైలు శిక్ష విధించడం, అప్పుడు వారు క్షమాపణలు చెప్పుకొని బయటపడటం అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక మూసేసిన పాఠశాలలలో ఇప్పుడు నిశ్చింతగా సచివాలయాలు నడిపించుకోవచ్చు. సచివాలయాలన్నీ వైసీపీ నేతల కనుసన్నలలోనే పనిచేస్తాయనేది బహిరంగ రహస్యం.
కనుక మొదట సచివాలయాలను ఏర్పాటు చేసి తరువాత ప్రాంగణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేసి క్రమంగా పాఠశాలలను వైసీపీ కార్యాలయాలుగా వినియోగించుకొనే దూరాలోచన కూడా ఉందేమో? ప్రభుత్వ సొమ్ముతో పాఠశాలలలో మరమత్తులు చేయించి అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాత ఖాళీ చేయించడమైంది కనుక అవసరమైతే వాటిని ప్రభుత్వం అమ్మేసుకోవచ్చు లేదా వైసీపీ నేతలే పంచేసుకొన్నా ఆశ్చర్యం లేదు.
వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ గురించి,అమరావతి, పోలవరం గురించి ముందు చూపు లేకపోవచ్చు కానీ పాఠశాలలను ఖాళీ చేయించడంలో చాలా ముందు చూపు ఉన్నట్లే అర్దమవుతోంది.



