హమ్మయ్య… రిజల్ట్స్ నిరుడు కంటే కాస్త బెటర్!

Minister-Botsa-Satyanarayana-Releases-SSC-Examinations-Resultsఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం విజయవాడలో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈసారి మొత్తం 6,05,052 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 72.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3,09,245 మంది బాలురు హాజరుకాగా వారిలో 69.27 శాతం, బాలికలలో 2,95,807 మందికి 75.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత 5 శాతం పెరగడం ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి చాలా ఊరట కలిగించే విషయమే. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఈసారి కేవలం 3.47 ఉత్తీర్ణత శాతం మాత్రమే పెరిగింది.

ADVERTISEMENT

రాష్ట్ర వ్యాప్తంగా 933 పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలలో ఒక్కరూ కూడా పాస్ అవకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 98.25 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలువగా నంద్యాల జిల్లా 60.39 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుంచి 10వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్దం చేయాలని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

తమ ప్రభుత్వం చేపట్టిన బైజూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సంస్కరణలతో విద్యావ్యవస్థ రూపురేఖలే మారిపోతాయని, కానీ దానికి కొంత సమయం పడుతుందని ఇదివరకు మంత్రి బొత్స సత్యనారాయణ సమర్ధించుకొన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం అంచనాల మేరకు పెరగలేదని స్పష్టం అవుతోంది.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్థుల కుటుంబ నేపద్యం, వారి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు, విద్యార్థుల అవగాహనా శక్తి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పించడమే చాలా గొప్ప విషయం అన్నట్లు మంత్రులు మాట్లాడుతుంటారు. కానీ 5, 6 తరగతులకు వచ్చినా తప్పులు లేకుండా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అక్షరాలు కూడా రాయలేని విద్యార్థులు కోకొల్లలు ఉన్నారు. కనుక ముందుగా అటువంటివారిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించి ఉండి ఉంటే సత్ఫలితాలు వచ్చి ఉండేవి. ప్రభుత్వం చేసిన ఖర్చుకు ప్రతిఫలం లభించిన్నట్లు ఉండేది.

ADVERTISEMENT
Latest Stories