ఎవరి గుర్తింపునో ఆశించి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. అలాగే చేసిన అభివృద్ధిని ఎవరో గుర్తించాలని తాపత్రయ పడాల్సిన పని లేదు.కానీ చరిత్ర అనేది ఒకటి ఎప్పుడు చేసే మంచిని చెడుని తన పుస్తకంలో భద్రపరిచే ఉంచుతుందని ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.
చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలే తప్ప పనులు శూన్యం..,హంగామాలే తప్ప అభివృద్ధి ఉండదు, గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప వాస్తవాలలో సాధ్యం కాదు అంటూ ఎద్దేవా చేస్తున్న వైసీపీ నాయకులకు కేటీఆర్ వ్యాఖ్యలు చెంప పెట్టులాంటివనే చెప్పాలి. హైద్రాబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటే దానికి తొలి ఇటుక వేసి పునాది నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అంటూ కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు బాబు కష్టాన్ని, కృషిని కొనియాడారు.
తాజాగా పలు టీవీ ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు కేటీఆర్. తాజాగా హైద్రాబాద్ తాజ్ దక్కన్ లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశానికి హాజరయిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రో బిసినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే అందరికి గుర్తుకువచ్చేది చంద్రబాబు నాయుడు అని, అలాగే ప్రో అగ్రికల్చర్, ప్రో రూరల్, ప్రో పూర్ అనగానే వైస్సార్ మార్క్ కనపడుతుందని ఇక తమ పార్టీ అధినేత అయిన కేసీఆర్ పాలనలో ఈ రెండు సమపాళ్లలో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు.
రెండుతెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంటే తనకు గుర్తుకొచ్చేది ఈ ముగ్గురు సీఎం లే అంటూ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ పేర్లు చెపుతూ చరిత్రను గుర్తించడమే కాదు గౌరవించడం కూడా తెలిసిన నాయకుడిగా కేటీఆర్ మరోసారి రెండు తెలుగు ప్రజల మన్ననలను పొందారు.ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి బాబు కారణమైతే రైతులకు రుణమాఫీ, రైతులకు తొమ్మిది గంట ఉచిత విద్యుత్ అంటూ రైతులకు అండగా నిలిచారు వైస్సార్.
అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఇంబర్స్మెంట్ వంటి పథకాల అమలుతో అటు మధ్యతరగతి ప్రజల భారాన్ని కొంత వరకు తగ్గించి సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనత వైస్సార్ సొంతం. అలాగే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, గత ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధిని కొనసాగిస్తూ మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారు కేసీఆర్. ఇలా గత నాయకులు వేసిన పునాదులతో ఇప్పటితరానికి అవసరమైన పాలన కొనసాగించాలే కానీ జగన్ మాదిరి గత ప్రభుత్వ ఆనవాళ్లు కూడా ఈ రాష్ట్రంలో తన ప్రభుత్వ హయాంలో కనిపించకూడదు అని కూల్చుకుంటూ పోతే ఇక ఎప్పటికి ఏపీకి రాజధాని అనేది అందని కలగానే మిగిలిపోతుంది అనేది జగన్ గుర్తించాలి.
ఎన్నికలలో ఆయా నేతల మద్దతుదారుల ఓటుని తన వైపు తిప్పుకోవడానికో, లేక తమ పార్టీ గెలుపుకి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కావొచ్చు కారణం ఏదైనా కానీ తమ ప్రత్యర్థి పార్టీ నేతల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం కేటీఆర్ లో ఉన్న రాజకీయ పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది.అందుకే అంటారు చరిత్ర రాసిన పేజీలు!ఎప్పటికి మాసిపోవు!అని.




