గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లను వైసీపీ గెలుచుకోగా రాబోయే ఎన్నికలలో పదికి పదీ టిడిపి గెలుచుకోబోతోందని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆనం రామనారాయణ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ఆ వేదికల పైనుంచే బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసేవారు. ఆ కారణంగా జగనన్న ఆయనను పక్కన పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణతో పార్టీ నుంచి బయటకు గెంటేశారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఒకటి రెండుసార్లు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు కానీ క్రమంగా నిశబ్ధం అయిపోయారు.
మళ్ళీ చాలా రోజుల తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడుకి వచ్చినప్పుడు అక్కడ మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆంఢ్రా నాగిరెడ్డి ఇంట్లో తన సన్నిహితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన టిడిపిలో చేరి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. ఆత్మకూరు కాకపోయినా జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికలలో పదికి పదీ టిడిపి గెలుచుకోబోతోందని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
వైసీపీలో నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని కానీ వారి పదవులు, కాంట్రాక్టుల కోసమే వైసీపీలో కొనసాగుతున్నారని, ఎన్నికల గంట మ్రోగగానే వైసీపీ నుంచి 50-60 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేస్తారని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ శాసనసభతో కలిసి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.
నెల్లూరు వైసీపీ నుంచి ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడు గిరిధర్ రెడ్డిని టిడిపిలోకి పంపించారు. ఎన్నికల గంట మ్రోగగానే ఆయన కూడా టిడిపిలోకి వచ్చేయాలని ఎదురుచూస్తున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ మద్య గొడవ ముదిరిపోవడంతో వారిద్దరిలో ఒకరు టిడిపిలోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే టిడిపి మరో వైసీపీగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వాన్ని టిడిపి విమర్శిస్తున్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను దూరంగా ఉంచితేనే బాగుంటుంది.



