“నేను బటన్ నొక్కి ప్రజలకు డబ్బు పంచిపెడుతుంటే, అదే విషయం ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడగటానికి మీకేమిటి కష్టం?” అని సిఎం జగన్మోహన్ రెడ్డి నిలదీస్తుంటారు. “అదీ నిజమే కదా… “ అనుకొంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గడప గడపకి వెళితే అక్కడ ప్రజలు చిన్నా పెద్దా… మంత్రీ… ఎమ్మెల్యే… అని చూడకుండా కడిగిపడేస్తున్నారు.
అసలు సంక్షేమ పధకాల పేరుతో ఇన్ని లక్షల కోట్లు గతంలో ఏ ప్రభుత్వమూ పంచిపెట్టలేదు. అయినా తమ వద్దకు వస్తున్న వైసీపీ నేతలని చూసి లబ్దిదారులు కూడా ఎందుకు మూతి విరుస్తున్నారో అర్దం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకొంటున్నారు.
గడప గడపకి కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 16వ వార్డులో పర్యటించినప్పుడు ఇలాగే ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన ప్రజలను “సంక్షేమ పధకాలు అందుతున్నాయా?” అని ప్రశ్నిస్తుంటే వాళ్ళు వార్డులో రోడ్లు, కాలువలు, త్రాగునీరు సమస్యల గురించి నిలదీయడం మొదలుపెట్టారు. దాంతో సాయిప్రసాద రెడ్డి చాలా అసహనానికి గురయ్యారు. అక్కడ సంక్షేమ పధకాల గురించి మాట్లాడే అవకాశమే రాకపోవడంతో అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లగా అక్కడ ప్రజలు తమకు అమ్మఒడి, వృద్ధాప్య పింఛనులు వగైరా రావడంలేదని కానీ అన్నీ ఇస్తున్నట్లు రికార్డులలో చూపుతున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి సమాధానాలు చెప్పుకోలేక సాయిప్రసాద రెడ్డి గడప గడపకి ఓ దణ్ణం పెట్టేసి వెళ్ళిపోతుంటే, “ఈమాత్రం దానికి ఇంతమందిని వెంటేసుకొని మా దగ్గరకు రావడం దేనికో…” అంటూ వెనక నుంచి మహిళల సన్నాయి నొక్కులు నొక్కడం ఇంకా బాధ కలిగిస్తుంది.
సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెడుతున్నా ప్రజలు ఇప్పుడే ఈవిదంగా నిలదీస్తుంటే, రేపు ఎన్నికలొస్తే మన పరిస్థితి ఏమిటి? ముందు టిడిపిని కాదు.. ఈ ప్రజలను ఏవిదంగా ఎదుర్కోవాలని ప్రతీ వైసీపీ నేత ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ లెక్కన జగన్ ప్రభుత్వం పంచిపెడుతున్న లక్షల కోట్లు ఏట్లో పిసికిన చింత పండే అవుతుందేమో?