ఇంట్లో పిల్లలు “మమ్మీ.. నన్ను డాడీ కొట్టరనో లేదా డాడీ నన్ను మమ్మీ కొట్టిందనో చేసే పిర్యాదులు చాలా ముచ్చటగా ఉంటాయి. కానీ మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి డాడీ కొట్టారని పిర్యాదు చేస్తే?అదే జరిగింది.
మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం దాడులు చేసుకుని ఒకరి తర్వాత మరొకరు హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో తండ్రీ కొడుకుల మద్య గొడవ జరిగినప్పుడు పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ ఒంటిపై గాయాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై పిర్యాదు చేయడంతో మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు మరోసారి బయటపడ్డాయి.
మంచు మనోజ్ తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా భూమా మౌనికని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచే వారి మద్య దూరం పెరిగింది. ఆ కారణంగానే వారు మోహన్ బాబుతో కలిసి ఉండటం లేదు. కనుక తండ్రి మంచు విష్ణుకి వందల కోట్ల విలువగల ఆస్తులు కట్టబెట్టేస్తున్నారని, విష్ణు తీసే సినిమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, కానీ తన పట్ల వివక్ష చూపుతున్నారని మంచు మనోజ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కనుక ఈ ఆస్తుల పంపకాల విషయం గురించి మాట్లాడేందుకు వెళ్ళినప్పుడే తండ్రీ కొడుకుల మద్య చిన్నగా వాగ్వాదం మొదలై కొట్టుకుని పోలీస్ స్టేషన్‌లో పరస్పరం పిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది.
గతంలో కూడ మంచు మనోజ్, మంచు విష్ణు మద్య ఈవిదంగానే గొడవ జరిగినప్పుడు దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. కానీ వారిరువురూ ఓ రియాల్టీ షో కోసం అలా నటించారని మోహన్ బాబు సర్ధి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కొడుకు తనని కొట్టాడని పిర్యాదు చేయడంతో మంచు కరిగిపోయి వారి గొడవలు బయటపడ్డాయి.
మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మోహన్ బాబు స్పందిస్తూ, “మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. వాటిని ఎవరూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.
కానీ తండ్రీ కొడుకులు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం పిర్యాదు చేసుకోవడం నిజమే అయితే ఆయన ఖండించి ప్రయోజనం లేదు. దేనినైనా దాచాలని ప్రయత్నిస్తేనే తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. కనుక “అవును మా మద్య కొన్ని సమస్యలున్నాయి అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం,” అని క్లుప్తంగా చెప్పి ఉంటే మీడియా ఇంత ఆసక్తి చూపేది కాదేమో?




