ఈ వయసులో శపధాలు, అవమానాలు, అప్రదిష్ట అవసరమా?

Mudragada Padmanabham Daughter Kranthi

పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి జాతీయ అవార్డులు పొందిన ప్రముఖులు కూడా ఆ బిరుదుల గురించి గొప్పగా చెప్పుకోరు. వారు పొందిన ఆ గౌరవం గురించి మీడియా, ఇతరులే చెపుతుంటారు.

ADVERTISEMENT

ముద్రగడ పద్మనాభం గురించి కూడా కాపు జాతి నాయకుడునని అందరూ చెప్పుకుంటారు. ఆ పేరు, గౌరవం సంపాదించుకోవడానికి ఆయనకు అనేక దశాబ్ధాలు పట్టింది. అంత కష్టపడి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను వైసీపిలో చేరిన నెల రోజులలోనే తన చేతులతోనే తానే తుడిచేసుకుంటున్నారు!

ఒకప్పుడు కాపులకు రిజర్వేషన్లే తన జీవిత ధ్యేయం అనుకోని పోరాడిన ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ను ఓడించడం ఒక్కటే తన జీవిత లక్ష్యం అనుకునే స్థాయికి దిగజారి పోవడం చూసి కాపు సామాజిక వర్గం కూడా ఆశ్చర్యపోతోంది.

పైగా పవన్‌ కళ్యాణ్‌ని ఓడించలేకపోతే తన పేరుని ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’గా మార్చుకుంటానని ఆయన శపధం చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు.

ఆయన కన్న కూతురు క్రాంతి కూడా ఇది జీర్ణించుకోలేక మీడియా ముందుకు వచ్చి తండ్రి వైఖరిని తప్పు పట్టారు.

“పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ని ఓడించేందుకు, వైసీపి అభ్యర్ధి వంగా గీతని గెలిపించేందుకు వైసీపి నేతలందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. నా తండ్రి ముద్రగడ పద్మనాభం కూడా వారిలో ఒకరు. అందుకు ఆయనను తప్పు పట్టడం లేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ని పిఠాపురం నుంచి తన్ని తరిమేయాలని మాట్లాడటం, పవన్‌ కళ్యాణ్‌ని ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటానని మా తండ్రి శపధం చేయడం సరికాదు. జగన్మోహన్‌ రెడ్డి కోసం పవన్‌ కళ్యాణ్‌ని కించపరిచే విధంగా మాట్లాడటం వలన మా తండ్రిగారికి ఒరిగేదేమీ ఉండదు కానీ ఎన్నికల తర్వాత ఎటూ కాకుండా పోతారని గ్రహిస్తే మంచిది,” అని క్రాంతి అన్నారు.

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కోసం ముద్రగడ పద్మనాభం చెలరేగిపోతే, ఒకవేళ మళ్ళీ జగనే గెలిచి అధికారంలోకి వచ్చి పట్టించుకోకపోతే అది ఆయనకు అవమానమే. ఒకవేళ వైసీపి ఓడిపోతే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి చెప్పిన్నట్లు ఆయన ఎటూ కాకుండా పోవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ ఇన్నేసి మాటలు అంటున్నందుకు జనసేన హిట్ లిస్టులో ఆయన పేరు చేర్చే ఉంటుంది. కనుక ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఈ అతి వలనన భవిష్యత్‌లో ముద్రగడ పద్మనాభంకు ఇబ్బందులు, అవమానాలు తప్పకపోవచ్చు. ఈ వయసులో ఎవరి కోసమో పేరు ప్రతిష్టలు పాడుచేసుకోవడం, అవమానాలు కొని తెచ్చుకోవడం అవసరమా? ఆలోచిస్తే బాగుంటుంది.

వైసీపిలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లకు ఈ ఇంగిత జ్ఞానం ఉంది కనుకనే వారు ఎన్నడూ తమ రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశ్యించి తప్పుగా లేదా చులకనగా మాట్లాడరు. ముద్రగడ పద్మనాభం కూడా ఇది గ్రహిస్తే ఆయనకే మంచిది.

జగన్మోహన్‌ రెడ్డి తీరును ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల తప్పు పడుతున్నారు. ముద్రగడ పద్మనాభం తీరుని ఆయన సొంత కూతురే తప్పు పడుతున్నారు. ఈ రెండూ చూస్తే వైసీపిలో అందరూ ఇంతేనా?అని సందేహం కలుగక మానదు.

ADVERTISEMENT
Latest Stories