టాలీవుడ్ లో ‘మెగాస్టార్’ చిరంజీవి తర్వాత ఆ స్థానం ఎవరిదీ? అంటే మహేష్, పవన్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్… ఇలా ఎవరి అభిమానులు వారి పేర్లు చెప్పుకుంటుంటారు. అయితే ఈ నలుగురిలో నెంబర్ 1 స్టార్ కావాలన్న తాపత్రయం ఎవరికీ లేదని చెప్పవచ్చు. కాస్తో కూస్తో చెప్పుకుంటే… జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాస్త గట్టిగా ప్రయత్నిస్తూంటారు. కానీ ఈ నలుగురు కాకుండా ‘సైలెంట్’గా నెంబర్ 1 స్పాట్ కోసం అల్లు వారబ్బాయి బాగా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని స్పష్టమవుతోంది.
అవును… గత నాలుగేళ్ళుగా స్టార్ హీరోలలో బన్నీకి ఉన్న హిట్స్ మరే హీరోకు లేవు. ‘దువ్వాడ జగన్నాధమ్’కు ప్రేక్షకుల ఆదరణ పెద్దగా చూరగోనకపోయినా, పవన్, మహేష్ రేంజ్ ఓపెనింగ్స్ ను రాబట్టాడు. దీంతో తన టార్గెట్ ఏంటో పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. ఇక ప్రస్తుతం చేస్తోన్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో తన ఫుల్ రేంజ్ ఏంటో చూపించాలనే తాపత్రయం బన్నీలో కనపడుతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే, అందులో ‘సింహాభాగం’ అల్లు అర్జున్ కే వెళ్తుందని చెప్పడంలో సందేహం లేదు.
గత నాలుగేళ్ళుగా స్టార్ డైరెక్టర్లతో పనిచేయడంతో, అవి సక్సెస్ అయినా అందులో మేజర్ క్రెడిట్ దర్శకులకు వెళ్ళగా, కమర్షియల్ హీరోగా బన్నీ ఎదగడానికి ఆ సినిమాలు ఉపయోగపడ్డాయి. కానీ ‘నా పేరు సూర్య’ సినిమాకు వచ్చేసరికి వక్కంతం వంశీ కొత్త దర్శకుడు. దీంతో ఓపెనింగ్స్ క్రెడిట్ మొత్తం బన్నీ అకౌంట్ లోనే పడుతుంది. దీనికి తగిన విధంగా సినిమా పబ్లిసిటీ అదిరిపోయేలా చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ అయితే బన్నీ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ అనుకున్నట్లుగా… ‘నా పేరు సూర్య’ సూపర్ హిట్ అయ్యి, కలెక్షన్స్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో పోటీపడగలిగితే నెంబర్ 1 స్థానానికి మార్గం సుగమం చేసుకున్నట్లే. ఒక వైపు పవన్ కళ్యాణ్ ఫీల్డ్ లో లేకపోగా, మరో వైపు గత రెండు సినిమాలతో మహేష్ డిజాస్టర్లు ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇంకా మొదలే కాలేదు గనుక, విడుదలకు మరో ఏడాది పడుతుంది. ప్రభాస్ ‘సాహో’ పరిస్థితి కూడా అంతే! ఈ లోపున బన్నీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాడు కూడా!
సరైన టైంలో విడుదల కాబోతున్న “నా పేరు సూర్య” గనుక రామ్ చరణ్ ‘రంగస్థలం,’ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ కలెక్షన్స్ ను దాటగలిగితే… నెక్స్ట్ మెగాస్టార్ అల్లు అర్జున్ అనే టాక్ జోరందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే అనాధికారికంగా బన్నీ కాంపౌండ్ లో ఈ మాటలు వినపడుతూనే ఉంటున్నాయి అనేది ట్రేడ్ టాక్. ఎందుకంటే వరుసగా సక్సెస్ లు ఇవ్వడమే ‘మెగాస్టార్’ స్థాయి! ఈ స్థాయిని బన్నీ అయిదేళ్లుగా అందుకుంటున్నాడు గనుక, దానికి అర్హుడు అయినట్లే! అయితే ఇది నటనలో కాదండోయ్! కేవలం కమర్షియల్ యాంగిల్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే!



