“మెగా బ్రదర్స్”గా కీర్తించబడే చిరంజీవి – నాగబాబు – పవన్ కళ్యాణ్… ముగ్గురూ కూడా రాజకీయ రంగంలో ప్రతికూల పరిస్థితులను చవిచూసిన వారే. చిరు అయితే రాజకీయాలకు దండం పెట్టేసి తన మునుపటి సినీ జీవితంలోకి వెళ్లిపోగా, సినీ జీవితంతో పాటు రాజకీయ రంగంలో కూడా ‘జనసేన’ ద్వారా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు.
ఇక అటు సినిమాలలో ఇమడలేక, ఇటు రాజకీయాలలో సక్సెస్ కాలేక అటు ఇటు ఊగుతోన్న మరో మెగా బ్రదర్ నాగబాబు ఎట్టకేలకు ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. సినీ జీవితంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయిన నాగబాబు, ఇక తన శేష జీవితం రాజకీయాలకే అనే విధంగా పరోక్షంగా ఓ భారీ ప్రకటనే చేసారు. సోమవారం నాడు జరగనున్న జనసేన సభలో దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు.
గత ఎన్నికలలో జనసేన తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకు చేదు అనుభవమే ఎదురయ్యింది. నాటి నుండి జనసేనకు దూరంగా ఉంటోన్న నాగబాబు, ఇటీవల మాత్రం మళ్ళీ చేరువయ్యారు. ఈ మధ్య నరసాపురంలో జరిగిన సభలో ప్రత్యక్షం అయిన ఈ మెగా బ్రదర్, 14వ తేదీన ఇప్పటంలో జరగబోయే ఆవిర్భావ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నాగబాబు ఇస్తోన్న ఈ రీ ఎంట్రీ జనసేనకు లాభమా? నష్టమా? అంటే… అది నాగబాబు నడవడిక మీద ఆధారపడి ఉంటుందని చెప్పాలి. పవన్ మాదిరి ఎప్పుడో ఒకప్పుడు ప్రజలకు దర్శనమిస్తే గుర్తుంచుకునేటంత పాపులారిటీ గానీ, ఫాలోయింగ్ గానీ నాగబాబుకు లేదు. కాబట్టి నిత్యం ప్రజలకు టచ్ లో ఉంటే కనీసం 2024లో సానుకూల ఫలితాలను అందుకునే అవకాశాలు ఉంటాయి.
మెగా కుటుంబ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కున్న ఏకైక సపోర్ట్ నాగబాబు ఒక్కడే. అయితే ఇప్పటివరకు మాట్లాడే విధానం మాత్రం విమర్శలకు దారి తీసింది. మున్ముందు కూడా అలాగే కొనసాగితే జనసేనకు గానీ, నాగబాబుకు గానీ పెద్దగా ఒరిగేది ఏమి ఉండకపోగా, పార్టీకి నష్టమే చేకూర్చిన వారవుతారు. క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చే ముందు ప్రజా సమస్యల మీద అవగాహన రావాలి, వాటికి పరిష్కార మార్గాలు చూపించాలి.
ఈ రెండింటిని అవపోశనం చేసుకోగలిగితే జనసేనకు ఓ మంచి నాయకుడు దొరికినట్లవుతుంది. అలా కాకుండా తమ్ముడుకున్న క్రేజీ ఇమేజ్ తో చక్రం తిప్పేద్దామని భావిస్తూ అడుగుపెడితే, అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కే గత ఎన్నికలలో రెండూ చోట్ల ప్రతికూల పరిస్థితులు ఎదురైన వైనాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత అధికార పార్టీపై అలుపెరుగని పోరాటం చేస్తే గనుక నాగబాబుకు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.