‘శ్రీమంతుడు’ ద్వారా టాలీవుడ్ నాట అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ‘జనతా గ్యారేజ్’తో మరో విజయాన్ని అందుకుని, ప్రస్తుతం “రంగస్థలం” సినిమాను సెట్స్ పైన ఉంచింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే మరో సినిమాను తెరపైకి తీసుకువచ్చింది సదరు బ్యానర్. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా “సవ్యసాచి” అనే సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగో వీక్షకులను అలరిస్తోంది.
గతంలో చైతూ – చందు కాంభినేషన్ లో ‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేసి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ జోడిని కలిపింది. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారనే చెప్పాలి. మహాభారతంలో అర్జునుడుకు ఉన్న “సవ్యసాచి” అన్న బిరుదును టైటిల్ గా పెట్టారంటే, చైతూ క్యారెక్టర్ అర్జునుడు తరహాలో ఉండబోతుందని దర్శకుడు చెప్పకనే చెప్తున్నారా! ఏమో ఏది ఏమైనా టైటిల్ మాత్రం ఫస్ట్ లుక్ లోనే ఆకట్టుకుంటోంది.


