ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవరూ వేయనన్ని గెటప్ లతో ప్రేక్షకులను అలరించిన అమితాబ్, ఈ వయసులోనూ వినూత్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఒక అమితాబ్, ఒక కమల్ హాసన్ వంటి నటులను తీర్చిదిద్దడం మళ్ళీ సాధ్యం కాదు అనే విధంగా వారి చిత్రాలు ఉంటాయి. బహుశా ‘కింగ్’ నాగార్జున కూడా ఈ బాటలో పయనించాలి అనుకుంటున్నారో ఏమో గానీ, ‘మనం’ సినిమా నుండి నాగ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లుగా కనపడుతోంది.
‘మనం’ చిత్రంలో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్న నాగ్, ఇటీవల “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రంతో డబుల్ బొనంజా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా “ఊపిరి” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా, ఇందులో నాగ్ లుక్ మరోసారి చర్చనీయాంశమైంది. వీల్ చైర్ లో కూర్చుని ‘కింగ్’ ప్రదర్శించిన హావభావాలు అభిమానుల ఆదరణతో పాటు సినీ విమర్శకుల మెప్పు పొందుతున్నాయి. కనిపించింది కాసేపే అయినా ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచింది మాత్రం ‘కింగ్’ నాగార్జున అని చెప్పడంతో అతిశయోక్తి లేదు.
తెలుగులో విలక్షణమైన పాత్రలకు నాగార్జున కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారన్న ప్రశంసలు సర్వత్రా వస్తున్నాయి. బాలీవుడ్ రచయితలకు అమితాబ్ బచ్చన్ ఓ వరం. ఎలాంటి వినూత్నమైన పాత్ర అయినా ఒప్పుకోవడంలో అమితాబ్ స్టైల్ వేరు. బహుశా టాలీవుడ్ లో ఈ స్థానాన్ని నాగ్ భర్తీ చేస్తారేమో అనే విధంగా తన సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. మున్ముందు కూడా మన ‘కింగ్’ మరిన్ని విభిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను మిగల్చాలని ఆశిద్దాం.



