ఎన్టీఆర్… ఈ మూడక్షరాల పేరు వెంటే పులకించే తెలుగు ప్రజలు ఎందరో… ఎందరెందరో..! అలాంటి మహనీయుడు తెలుగు వారిని విడిచి నేటితో 20 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘననివాళి అర్పిస్తున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తిగా విశ్వవ్యాప్తంగా “ఎన్టీఆర్”కున్న పేరు తెలియనిది కాదు. అలాంటి “ఎన్టీఆర్” పేరుకు ఆయన నటవారసుడు బాలకృష్ణ ఓ కొత్త అర్ధాన్ని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అని మాత్రమే నేననుకోను…
‘ఎన్’ అంటే నటనిలయం. ఆయనే కాదు, ఆయన ఇల్లే ఒక నటనిలయం. అందులో ఆయన ఒక నటరాజా నటసింహుడు.
‘టి’ అంటే తారక మండలం… తారక ధృవతారకుడు.
‘ఆర్’ అంటే రాజర్షి రారాజు… రాజకీయ దురంధర యుగంధరుడు… రమణీయ రమ్య కమనీయ సౌమ్య వృధాముడు.
అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేనెప్పుడూ మీకు అండగా ఉంటానని చెప్పి మనకు ప్రసాధించిన పార్టీ. ఆయన తర్వాత పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య పలు సంచలన వ్యాఖ్యలకు దారితీసారు.
“తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు దేశంలో మరే పార్టీకి లేరని నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పగలనని, ఈనాడు ఇక్కడ ఉన్న మంత్రులు గానీ, ఎవరైనా గానీ ఆయన పెట్టిన భిక్షే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా కొంచెం జాప్యం జరిగింది. చాలా చింతిస్తున్నాను. రామారావు గారు పార్టీలకతీతమైన వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీల్లో ఆయన అభిమానులున్నారు. ఆయన పట్ల ఇలా వ్యవహరించినందుకు గానూ విచారం వ్యక్తం చేస్తున్నాను” అంటూ బాలయ్య చేసిన ప్రకటనలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి.
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని సోషల్ మీడియాలో కూడా స్పందించారు బాలకృష్ణ. “ఎన్టీఆర్ కలలను తాను నిజం చేస్తానని, మరణం లేని జననం ఆయనదని బాలయ్య పేర్కొన్నారు. “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అని పేదరికం లేని సమాజానికి బాటలు వేసిన తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత గాథ బోధ తమకు భగవద్గీత అని ఆయన పేర్కొన్నారు. ‘అమరపురి అధినేత, అందుకో మా జ్యోతా’ అని ఆయన సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. దీనికి ఆయన అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.





