నందమూరి కుటుంబంలో అందరితోను మంచి ప్రేమానుబందాలు కలిగిన వ్యక్తి తారకరత్న. ఇంత చిన్నవయసులోనే అతను చనిపోవడంతో అతని తల్లితండ్రులు సీత, మోహనకృష్ణలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తారకరత్నకి గుండెపోటు వచ్చి బెంగళూరులోని నారాయణ హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడని తెలిసినప్పటి నుంచే వారిరువురూ మొక్కని దేవుడు లేడు. ఏడ్వని రోజూ లేదు.
తారకరత్న తల్లి సీత ఒక్కగానొక్క కొడుకు పరిస్థితి చూసి చాలా రోజులుగా దిగులుతో మంచం పట్టారు. పైగా ఆమెకి షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణిస్తోంది. కనుక కుటుంబ సభ్యులు ఆమెని హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె మెలకువగా ఉన్నంతసేపు కొడుకుని తలుచుకొంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ గుండె నిబ్బరం చేసుకొని బెంగళూరు వెళ్ళి కొడుకుని చూసి వస్తున్నారు. కొడుకు కోసం వారు ఇంతగా కుమిలిపోతుంటే, వైసీపీ సోషల్ మీడియా ఈ సమయంలో కూడా శవరాజకీయాలు చేయడం మానుకోలేదు.
తారకరత్న భౌతికకాయం ఆదివారం శంకరపల్లిలోని ఆయన నివాసంలో ఉంచినప్పుడు కూడా తల్లితండ్రులు రాలేదని, వారిరువురూ కొడుకు కులాంతర వివాహం చేసుకొన్నందునే చివరిచూపు చూసేందుకు కూడా రాకుండా మొహం చాటేశారంటూ వాస్తవాలు తెలుసుకోకుండానే దుష్ప్రచారం ప్రారంభించేసింది.
అయితే తారకరత్న తల్లితండ్రులు ఈరోజు ఫిలిమ్ ఛాంబర్‌లో కుమారుడిని చివరిచూపు చూసేందుకు వచ్చినప్పుడు, వారు ఎంత శోకం అనుభవిస్తున్నారో, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న తారకరత్న తల్లి సీత, మరొకరి సాయం లేనిదే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమెని కుమార్తె రూప, బంధువులు ఇరువైపులా పట్టుకొని నడిపిస్తుంటే వారి సాయంతో అతికష్టం మీద నడుస్తూ, ఫ్రీజర్ బాక్సులో చలనం లేకుండా కనిపించిన కొడుకుని చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. అది చూసి ఆ కన్నతల్లి ఎంత గర్భశోకం అనుభవిస్తున్నారో అర్దమవుతుంది. మోహనకృష్ణ మొహంలో కూడా తన చేతుల మీదుగా పెంచిన కొడుకు చనిపోయాడనే బాధ కనిపిస్తూనే ఉంది.
వారికే కాదు కన్నకొడుకు చనిపోతే బాధ ఎవరికైనా అలాగే ఉంటుంది. కన్నకొడుకు చనిపోతే వైసీపీ నేతలెవరైనా భరించగలరా?మరి అటువంటప్పుడు తారకరత్న తల్లితండ్రులు బాధపడటం లేదని వైసీపీ ఎలా చెపుతోంది? అయినా ఇలాంటప్పుడు కూడా ఈ కులగజ్జీ, శవరాజకీయాలు అవసరమా?ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారిని ఏమనుకోవాలి?





