వైఎస్సార్ వచ్చేసారోచ్!

Nandhyala By Elections - YSR Congress నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు అనేక ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా… వేణుమాధవ్ అన్నట్లు, ఎక్కువగా ‘చంద్రబాబు’ నామాన్నే స్మరిస్తూ, ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. గత వారం రోజులుగా ఒక్క నంద్యాలలోనే తిష్ట వేసుకుని కూర్చున్న జగన్, ఈ సీటును ఎలాగైనా పొంది, వచ్చే రెండేళ్ళు అధికార పక్షంపై ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తున్నారు.

అయితే జగన్ చేసిన ప్రసంగాల వలన స్వలాభం కంటే ప్రత్యర్ధి పార్టీకే ఎక్కువ ప్రయోజనం చేకూరినట్లుగా పొలిటికల్ వర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. ఇక ప్రచారం కూడా తుది దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగానే మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జగన్ కు లభించిన ప్రజాధరణ అంతా వైఎస్సార్ పుణ్యమే అన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ పై అభిమానంతోనే జగన్ ప్రసంగాలకు జనం విచ్చేస్తున్నారన్నది బహిరంగమే.

ADVERTISEMENT

కానీ ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు జగన్ తన తండ్రి ‘వైఎస్’ పేరును పెద్దగా ప్రస్తావించలేదు. బహుశా తనకే ఆ స్థాయి వచ్చేసిందనుకున్నారో లేక నంద్యాలలో వైఎస్ పేరు వలన ఓట్లు పెద్దగా రాలవని భావించారో లేక ఇక వైఎస్ పేరు చెప్పుకునే ఉద్దేశం లేదో గానీ… వాస్తవానికి అయితే ఇప్పటికే వైఎస్ పేరును జపిస్తూ ప్రచారం సాగాలి. ఒక్క ప్రసంగంలోనే కాదు, సోషల్ మీడియాలో వైఎస్ ను పెద్దగా ఫోకస్ చేయలేదు. దీంతో ‘వైఎస్ పేరు విస్మయం’ వెనుక పక్కా ప్రణాళిక ఉందన్న విషయం స్పష్టమైంది.

అయితే ఈ ప్రభావం తెలుసుకున్నారో ఏమో గానీ చివరి నిముషంలో వైఎస్ ను తెరపైకి తీసుకువచ్చారు. చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టినా, అది తనపై ప్రజల్లో నెగటివ్ గా మారుతుందన్న అభిప్రాయాలు అన్ని వైపుల నుండి రావడంతో, ఇక తన తండ్రిని రంగంలోకి దించడమే మెరుగు అనుకున్నారో ఏమో గానీ, గతంలో పాదయాత్ర సందర్భంగా నంద్యాల చేరుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను షేర్ చేసుకున్నారు. దీంతో మరోసారి ‘వైఎస్’ సెంటిమెంట్ నే వైసీపీ నమ్ముకుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏ యాంగిల్ ను వదలకుండా జగన్ చేసిన ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో ఈ నెలాఖరున తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories