సుకుమార్ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా సంక్రాంతి పర్వదినాన్ని పూర్తిగా వినియోగించుకుంటోంది. ఈ సినిమాపై భిన్న స్పందనలు వ్యక్తమైనప్పటికీ సెలవుల కారణంగా మంచి వసూళ్ళనే రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ, తెలంగాణాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఓవర్సీస్ లో 2016 సంక్రాంతి విన్నర్ “నాన్నకు ప్రేమతో” సినిమా అని డిక్లేర్ చేసారు. ప్రీమియర్స్ తో కలిపి తొలి మూడు రోజులకు గానూ దాదాపుగా 1 మిలియన్ డాలర్స్ దరిదాపుల్లోకి రావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు “బాద్ షా” చిత్రం ఒక్కటే మిలియన్ క్లబ్ లో ఉండగా, తాజాగా “నాన్నకు ప్రేమతో” ఈ జాబితాలో చేరబోతోంది.
నిజానికి ఓవర్సీస్ లో జూనియర్ ఎన్టీఆర్ కు పెద్దగా మార్కెట్ లేదు. ‘దూకుడు’ సినిమా తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన “బాద్ షా” కొంతవరకు మార్కెట్ ను ఏర్పరచగా, ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయాయి. ప్రస్తుత సినిమా “నాన్నకు ప్రేమతో” కలెక్షన్స్ కు కూడా దర్శకుడు సుకుమార్ కున్న క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బహుశా ఇదే ఊపును తన తదుపరి చిత్రాలకు కూడా కొనసాగించగలిగితే ‘బుడ్డోడు’కు ఓవర్సీస్ లో మార్కెట్ ఏర్పడినట్లే! ప్రస్తుతానికి మాత్రం ఆ క్రెడిట్ దర్శకుల జాబితాలోకి వెళ్ళిపోతోంది.





