“చంద్రబాబు నాయుడుని గత 35 ఏళ్ళుగా కుప్పం నుంచి గెలిపిస్తున్నారు. ఈసారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అంటూ ఆయన సతీమణి భువనేశ్వరి కుప్పం ప్రజలని సరదాగా అడిగిన మాటని పట్టుకొని మంత్రులు రోజా, అంబటి రాంబాబు, వైసీపి నేతలు, వారి బాకా మీడియా “చంద్రబాబు నాయుడు అప్పుడే ఓటమి అంగీకరించేశారు. ఈసారి కుప్పంలో ఓటమి తప్పదని గ్రహించి, తన భార్యని అక్కడ నిలబెట్టేందుకు సిద్దమయ్యారు. కానీ కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు,” అంటూ మాట్లాడేస్తున్నారు.
రాజకీయాలలో కొన్నిసార్లు యధాలాపంగా అన్న మాటలు కూడా ఈవిదంగా బ్యాక్ ఫైర్ అవుతుంటాయని ఇది స్పష్టం చేస్తోంది. భువనేశ్వరికి కుప్పం ప్రజలతో దశాబ్ధాలుగా బలమైన అనుబంధం ఉంది కనుకనే ఆమె సరదాగా వారిని ఆవిదంగా అడిగి ఉండవచ్చు.
కానీ ఓ వైపు టిడిపి, జనసేనల పొత్తులు, వాటితో బీజేపీ కూడా కలువబోతుండటం, మరోపక్క వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, పార్టీలో అసంతృప్తుల అలజడి ఇలా అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపికి భువనేశ్వరి మాట్లాడిన ఈ చిన్న మాట పెద్ద ఆయుధంగా కనబడటం ఆశ్చర్యం లేదు.
అయితే చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటే, ఇంత శ్రమించే అవసరం ఏముంది? మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారంటూ నారా లోకేష్‌తో సహా టిడిపి నేతలందరూ పదేపదే చెపుతూనే ఉన్నారు కదా?
ఒకవేళ ఈసారి కుప్పం నుంచి తన సతీమణి భువనేశ్వరిని పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే ఆదేమైనా నేరమా?
ఈసారి శాసనసభ ఎన్నికలలో ప్రతీ ఒక్క సీటు టిడిపి, జనసేనలకు చాలా కీలకమైనదే. ఆ రెండు పార్టీలు 160 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి కనుక వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు, చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ, భువనేశ్వరిని కుప్పం నుంచి పోటీ చేయిస్తే అది రాజకీయ వ్యూహంగానే చూడాలి.
వైసీపిలో డజన్ల కొద్దీ సిట్టింగ్ ఎంపీలను, ఎమ్మెల్యేలను, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చుకుంటునప్పుడు అవన్నీ 175 సీట్లు గెలుచుకోవడానికే అని గొప్పగా చెప్పుకుంటోంది కదా?ఒకవేళ కుప్పంలో చంద్రబాబు నాయుడుకి బదులు భువనేశ్వరి పోటీ చేయడం తప్పయితే, మరి వైసీపిలో చేస్తున్న ఈ మార్పులు చేర్పులని ఏమనాలి? అంటే వైసీపి చేస్తే సంసారం… ప్రతిపక్షాలు చేస్తే వ్యభిచారమా?
—






