అమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది… మళ్ళీ ఆ మాట మాట్లాడొద్దని

NAra Bhuvaneswari Warns Nara Lokeshఏపీలో మంత్రులు అంబటి రాంబాబు, ఆర్‌కె.రోజా, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు మీడియా ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే భాష ఏవిదంగా ఉంటుందో అందరూ వింటూనే ఉన్నారు. ముఖ్యంగా కొడాలి నాని, అంబటి రాంబాబు వైసీపీలో బూతుల స్పెషలిస్టులుగా మంచి పేరు సంపాదించుకొన్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

కానీ టిడిపి యువనేత నారా లోకేష్‌ మొన్న పాదయాత్రలో ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్నప్పుడు ఆవేశంలో వైసీపీ నేతలను ఉద్దేశ్యించి ఓ అనుచిత పదం వాడారు. గమ్మతైన విషయం ఏమిటంటే దానిని ఆ వైసీపీ నేతలు పట్టించుకోలేదు కానీ నారా లోకేష్‌ ప్రసంగాలను నిశితంగా గమనిస్తున్న ఆయన తల్లి భువనేశ్వరి వెంటనే ఫోన్‌ చేసి, “మళ్ళీ ఎప్పుడూ ఆ పదం వాడొద్దు. మన రాజకీయ ప్రత్యర్దుల పట్ల అయినా అనుచితంగా మాట్లాడటానికి వీల్లేదు,” అంటూ నాకు క్లాసు పీకారని నారా లోకేష్‌ స్వయంగా చెప్పుకొన్నారు.

ఈరోజు పాదయాత్రలో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు తదితర వివిద రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమైనప్పుడు, నారా లోకేష్‌ స్వయంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన చేసి, “ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకుపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూశారే తప్ప ఏనాడూ లాయర్లను, వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను, ఉపాధ్యాయులను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నేను ఆయన తీసుకొన్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించను కానీ ఆయన పద్దతిని గౌరవిస్తాను. అందుకే దారిలో ఆయన విగ్రహం కనిపించినప్పుడు దండం పెట్టాను. అదే నా తల్లితండ్రులే నాకు నేర్పిన సంస్కారం,” అని నారా లోకేష్‌ అన్నారు.

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల గురించి కూడా నారా లోకేష్‌ తన మనసులో ఆవేదనను వారితో పంచుకొన్నారు. “మన ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తలుచుకొంటే చిటికలో పెట్టుబడులు, పరిశ్రమలు సాధించుకోగలుగుతోంది. కానీ మన ఆంధ్రాకు పెట్టుబడులు రావడం లేదు… పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రంలో ఉన్నవి కూడా పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయి. ఓ ఆంధ్రా పౌరుడిగా, ఆంధ్రా యువకుడిగా నేను మన రాష్ట్రం పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నాను. ఇరుగుపొరుగు రాష్ట్రాల అభివృద్ధిని చూసి అసూయపడుతున్నాను, “ అని అన్నారు.

“చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా ఫాక్స్ కాన్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఏపీలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. కానీ ఇక్కడి దారుణ పరిస్థితులను చూసి ఆ కంపెనీ తెలంగాణకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో చెరో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. వాటి ద్వారా ఆ రెండు రాష్ట్రాలలో లక్షమందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. అదే… ఆ రెండు ప్లాంట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యి ఉండి ఉంటే ఆ లక్ష ఉద్యోగాలు మన ఆంధ్రా యువతకే దక్కేవి కదా… అని బాధపడుతున్నాను,” అని నారా లోకేష్‌ అన్నారు.

ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు రప్పించేందుకు ప్రయత్నిస్తానని, ఏటా టంచనుగా జాబ్‌ క్యాలండర్ విడుదల చేసి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories