దేశంలో ఎవరికీ రాని మూడు రాజధానుల గొప్ప ఆలోచన జగనన్నకు మాత్రమే రావడం ఆంధ్రా ప్రజల భాగ్యమో… దౌర్భాగ్యమో తెలీదు కానీ, దాని వెనుక ఉన్న గొప్ప వ్యూహం మాత్రం అచ్చంగా టిడిపి, జనసేనల కోసమే ‘ప్రత్యేకంగా డిజైన్’ చేయబడిందని చెప్పొచ్చు. దీని కోసం ముందుగా అమరావతి మీద కమ్మ, టిడిపి బ్రాండింగ్ చేసి పక్కన పెట్టేశారు.
అమరావతి కోసం భూములిచ్చిన రైతులందరి మీద కూడా కమ్మ, టిడిపి ముద్ర వేసేసి అది టిడిపి స్పాన్సర్డ్ ఆందోళనలని రాష్ట్ర ప్రజలకు నచ్చజెప్పాలని విశ్వప్రయత్నం చేశారు కానీ ప్రజలను నమ్మించలేకపోయారు. బహుశః ఆ ఉక్రోషంతోనే అరసవెల్లికి పాదయాత్రగా బయలుదేరిన రైతులపై వైసీపీ నేతలు తమ ప్రతాపం చూపించి ఉండవచ్చు.
వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని పక్కన పడేసినందుకు, దానిపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తే ఆశ్చర్యం లేదు. కనుక వచ్చే ఎన్నికలలో ఈ జిల్లాలలో అమరావతి అంశమే కీలకం కానున్నది. దానికీ వైసీపీ మూల్యం చెల్లించక తప్పకపోవచ్చు.
టిడిపి, జనసేనల కోసం వైసీపీ ఏం స్కెచ్ వేసిందంటే, అటు రాయలసీమలోను, ఇటు ఉత్తరాంద్ర జిల్లాలలోను మంత్రులు, ఎమ్మెల్యేల చేత ప్రాంతీయ ర్యాలీలు, రౌండ్ టేబిల్ సమావేశాలు, సభలు నిర్వహింపజేసి, ఆ రెండు ప్రాంతాలను అభివృద్ధి చేద్దామనుకొంటే టిడిపి, జనసేనలు సైంధవుడిలా అడ్డుపడుతున్నాయని నొక్కి చెప్పించారు. కనుక టిడిపి, జనసేనలను రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రజలు తరిమి తరిమి కొట్టాలని హితోపదేశం చేశారు. ఇదే వైసీపీ మూడు రాజధానులు వెనుక ఉన్న స్కెచ్!
కానీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెన్నైలోని పెట్టుబడిదారుల సమావేశానికి వెళ్ళి “మూడంటే మూడు కాదు… విశాఖ ఒక్కటే రాజధాని…కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ అంతే…” అంటూ నోరు జారారు. కర్నూలుని న్యాయరాజధాని అని చెప్పిన నోటితోనే కర్నూలుకి హైకోర్టుని తరలించబోమని, హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటుచేస్తామనే రహస్యం కూడా వైసీపీయే బయటపెట్టుకొంది. అంటే రాయలసీమ, అమరావతి ప్రజలకు హ్యాండ్ ఇచ్చేసిన్నట్లే కదా?
ఇక మిగిలింది విశాఖ రాజధాని! దానికే ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా జగనన్న విశాఖకు మకాం మార్చడానికి మీనమేషాలు లెక్కిస్తుండటం చూసి ఉత్తరాంద్ర ప్రజలే కాదు… వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకొంటున్నారు.
ఇప్పుడు నారా లోకేష్ వైసీపీకి ఊహించని విదంగా మరో దెబ్బ కొట్టారు. మంగళవారం కర్నూలు పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు, న్యాయవాదులు ఆయనను కలిసి కర్నూలు రాజధానిపై స్పష్టత ఇవ్వాలని కోరగా, ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతో వారు సంతృప్తి చెంది నారా లోకేష్‌కి, టిడిపికి జైకొట్టారు. దీంతో వైసీపీ చేతిలో మిగిలిన చివరి ఆయుధాన్ని కూడా నారా లోకేష్ తీసేసుకొన్నట్లయింది.
ఈవిదంగా మూడు రాజధానుల పేరుతో టిడిపి, జనసేనల కోసం తీసిన గోతిలో వైసీపీయే పడటం యాదృచ్ఛికం కాదు… ఖచ్చితంగా దేవుడి స్క్రిప్టే… కదా?



